ఇవాళ్టి నుంచి మాయావతి, పవన్ ఉమ్మడి ప్రచారం

Update: 2019-04-03 01:54 GMT

మిత్రపక్షాలైన జనసేన, బీఎస్పీ అధినేతలు ఉమ్మడిగా ప్రచారంగంలోకి దిగుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇవాల్టి నుంచి ఏపీలో కలిసి ప్రచారం సాగిస్తారు. రేపు హైదరాబాద్‌లో కూడా ఇద్దరూ బహిరంగ సభలో పాల్గొంటారు.

ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి తన మిత్రపక్షమైన బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సాయం కూడా తీసుకొంటున్నారు. ఎన్నికల్లో కలసి పోటీ చేస్తున్న జనసేన, బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేస్తారు. మాయావతి నిన్న సాయంత్రం విశాఖ పట్టణం చేరుకున్నారు. పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టుకు వెళ్ళి మాయావతికి స్వాగతం పలికారు. ఆమె ప్రయాణిస్తున్న కారు డోరును ఆయనే స్వయంగా తెరిచారు. మాయావతి వాహనం దిగగానే ఆమె పాదాలకు మొక్కి ఆశీర్వచనం తీసుకున్నారు.

మాయావతి రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణాలో పర్యటిస్తారు. ఇవాళ ఉదయం విశాఖపట్టణంలో పవన్‌తో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో మాయ, పవన్ పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మాయావతి బీఎస్పీ అధినేత్రి , జనసేన అధ్యక్షుడు తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు సాయంత్రం ఐదుగంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మాయావతి, పవన్ ప్రసంగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాయావతి ప్రచారం జనసేన అభ్యర్థుల విజయానికి మరింత దోహదపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆమె రాకతో ప్రచారం జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

Similar News