ఏపీ ఎన్నికల్లో చతికిలపడ్డ జనసేన

Update: 2019-05-25 08:08 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమవుతామని ముందుకొచ్చిన జనసేన పార్టీ ఎన్నికల్లో ఏమాత్రం బరిలో నిలువలేకపోయింది. ఈ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన స్థానాలు అయిదే కనిపిస్తున్నాయి. అదే సమయంలో 30కి పైగా శాసనసభ స్థానాల్లో జనసేన ప్రభావం వల్ల తెలుగుదేశం నష్టపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీపై ప్రభావం పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో మొత్తం 132 స్థానాల్లో జనసేన పోటీ చేయగా ఆ పార్టీ సాధించిన ఓట్లు మొత్తం పోలైన ఓట్లలో 5.35శాతమే. చాలా చోట్ల ఘోరంగా ఓటమి పాలయింది. ఉత్తరాంధ్ర జిల్లాలను పరిశీలిస్తే పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాకలోనే 58539 ఓట్లు సాధించారు. ఇది మినహాయిస్తే మరెక్కడా 30 వేల స్థాయికి ఓట్లు తెచ్చుకోలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో 10 వేల ఓట్లు దాటాయంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర సమస్యలను పవన్‌కల్యాణ్‌ విస్తృతంగా వెలుగులోకి తీసుకువచ్చారు. ఉద్దానం ప్రాంతం కూడా జనసేన ఆశించిన స్థాయిలో ఆదుకోలేకపోయిందనే చెప్పవచ్చు. భీమిలి, పెందుర్తి, ఎలమంచిలి నియోజకవర్గాల్లోనే దాదాపు 20వేలు, అంతకుమించి ఓట్లు తెచ్చుకుంది. భీమిలి, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లోనే దాదాపు 20 వేల వరకు ఓట్ల చీలికకు కారణమయింది.

మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ చేసిన తెనాలిలో 29905 ఓట్లు వచ్చాయి. దక్షిణ కోస్తాలో కావలి, ఒంగోలు, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లోనే 10 వేల స్థాయి ఓట్లు రాబట్టుకోగలిగింది. ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్‌, మదనపల్లి, పుంగనూరు వంటి చోట్ల 10 వేల నుంచి 15వేల ఓట్ల మధ్య జనసేన సాధించింది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన 4, 5 స్థానాల్లోకి జారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్‌, నోటాకు వచ్చిన ఓట్ల కన్నా కూడా తక్కువగా జనసేనకు వచ్చాయి.

జనసేన రాష్ట్రంలో ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే గెలుపొందింది. సాక్షాత్తూ పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాలూ భీమవరం, గాజువాకలో రెండో స్థానంలోనే ఆగిపోయారు. భీమవరం, గాజువాక, నరసాపురం రాజోలు, అమలాపురం స్థానాల్లో జనసేన కొంత మేర పోటీ ఇవ్వగలిగింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన చెప్పుకోతగ్గ ఓట్లు సాధించింది. 

Similar News