తొలిసారి ఎన్నికల బరిలో నాగబాబు.. కులబలం కలిసోచ్చేనా?

Update: 2019-03-22 13:15 GMT

తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కొణిదెల నాగబాబు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్‌ దాఖలు చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య, కొందరు సన్నిహితులు వెంటరాగా జనసేనాని అన్నయ్య నాగబాబు..నరసాపురం ఆర్‌డిఒ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను అందచేశారు. ప్రజా శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన జనసేన పార్టీకి అందరూ అండగా నిలవాలని నామినేషన్ వేశాక నాగబాబు విన్నవించారు. నరసాపురం ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

ఇటీవలే జనసేన పార్టీలో చేరిన నాగబాబుకు పవన్ కల్యాణ్ నరసాపురం ఎంపీ సీటు కేటాయించారు. దీంతో ఆయన తమ్ముడి పార్టీ తరుఫున తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. నర్సాపురం లోక్‌సభ స్థానం బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి రఘురామకృష్ణంరాజు, టీడీపీ అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు బరిలో నిలిచారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ, టీడీపీ అభ్యర్థులతో నాగబాబు తలపడుతున్నారు. నర్సాపురం లోక్‌సభ పరిధిలోని ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువ. అదే సామాజిక వర్గానికి నాగబాబుకు ఈ అంశం కలిసొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గం నర్సాపురం పరిధిలోకి వస్తుండటం నాగబాబుకు కలిసొచ్చే మరో అంశం. భీమవరంలో పవన్‌కు ఎక్కువ ఓట్లు పడితే నరసాపురంలో నాగబాబుకి కూడా ఎక్కువ ఓట్లు వస్తాయని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు.     

Similar News