అన్నయ్యలాగే పవన్‌ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతారా...

Update: 2019-03-13 02:57 GMT

యుద్ధరంగంలోకి తన సైనికులను పంపేందుకు జనసేనాని మేథోమథనం చేస్తున్నారు. ఏ సైనికుడు, ఎక్కడి నుంచి కత్తి దూస్తే విజయమే లెక్కలేస్తున్నారు. మరి జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గం నుంచి గెలిచి, అసెంబ్లీలో అధ్యక్ష అనాలనుకుంటున్నారు?

శాసన సభ, లోక్‌సభకు జనసేన అభ్యర్థులను ప్రకటించే కసరత్తులో ఉన్న ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, తాను మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. పోటీ చేయడం పక్కా అన్న జనసేనాని ఏ స్థానం నుంచి రంగంలోకి దిగుతారన్న విషయం మాత్రం తేల్చడం లేదు. కానీ రకరకాల ఊహాగానాలు మాత్రం, ఆసక్తి కలిగిస్తున్నాయి.

అనంతపురం నుంచి పోటీ చేయాలని, అభిమానులు, కార్యకర్తలు అడుగుతున్నారని గతంలో చెప్పారు పవన్ కల్యాణ్. అనంతలో జరిగిన కార్యక్రమాల్లో చాలాసార్లు తన మనసులో మాట బయటపెట్టారు.

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలవడంతో, పవన్‌ కూడా తాను సైతం రాయలసీమ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఎన్నికలు దగ్గరకొచ్చేకొద్దీ, పవన్ కల్యాణ్‌‌, మనసు మారుతున్నట్టు కనపడుతోంది. సీమ నుంచి టర్నింగ్ ఇచ్చుకుంటే, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని సెగ్మెంట్ల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి.

విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పోటీ చేయాలని పవన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీకి ఫాలోయింగ్ బాగుందని భావిస్తున్నారు పవన్. ముఖ్యంగా గాజువాకలో జనసేన సభ్యత్వాలు లక్ష దాటాయి. పవన్ సామాజికవర్గం ఓట్లు కూడా దండిగా ఉన్నాయి. అందుకే గాజువాక నుంచి పోటీ చేస్తే, గెలుపు నల్లేరుపై నడకేనని జనసేనాని భావిస్తున్నారు.

ఇక జనసేనాని మదిలో తాజాగా మెదులుతున్న మరో నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నట్టు గతంలోనే చెప్పారు పవన్ కల్యాణ్.

గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గమే ప్రబలమైన వర్గం. దీంతో మొదటి నుంచి ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు పవన్. 2009లోనూ ప్రజారాజ్యం పార్టీకి, ఈ రెండు జిల్లాల నుంచి అత్యధిక స్థానాలొచ్చాయి. దీంతో పిఠాపురం నుంచి పోటీ చేస్తే, ఎలాంటి ఇబ్బంది ఉండదని లెక్కలేస్తున్నారు పవన్. సామాజికవర్గానికి, అభిమానులు కూడా తోడయితే, తనకు తిరుగే ఉండదని అనుకుంటున్నారు. అందుకే పవన్ పోటీ చేసే ఛాన్స్ ఉందన్న నియోజకవర్గాల్లో, గాజువాక తర్వాత, పిఠాపురం పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ జనసేన సభ్యత్వాలు కూడా భారీగా నమోదయ్యాయి.

గాజువాక, పిఠాపురం తర్వాత మరో రెండు స్థానాలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఏలూరు, విజయవాడ తూర్పులున్నాయి. మొత్తానికి జనసేన అధినేత పోటీ చేస్తాడనుకుంటున్న స్థానాలపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు లేదంటే అన్నయ్యలాగే రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతారా అన్నది అతిత్వరలోనే తేలిపోతుంది.

Full View 

Similar News