చెరగని జలియన్‌వాలా బాగ్ జ్ఞాపకాలు..ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణాల్లో ఒకటి...

Update: 2019-04-13 04:36 GMT
Reginald Dyer

10 నిమిషాలు ఏకదాటిగా కాల్పులు 1650 రౌండ్ల తూటాల వర్షం నిస్సాహయులైన వేలాది మందిపై రాక్షత్వం అదే జలియన్ వాలాబాగ్ మారణకాండ. నాటి నరమేధానికి నేటితో సరిగ్గా వందేళ్లు.

సరిగ్గా వందేళ్ల క్రితం జలియన్ వాలాబాగ్‌లో నెత్తురోడింది. జలియన్ వాలాబాగ్ తోటలో పంజాబీ ఉత్సవమైన వైశాఖీ జరుపుకోవడానికి దాదాపు 20వేల మంది అక్కడికి వచ్చారు. ప్రజలను అణగదొక్కే కఠినమైన రౌలత్ చట్టానికి వ్యతిరేకించేందుకు చాలామంది వచ్చారు. జాతీయ నేతలు సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూల అరెస్టు, దేశ బహిష్కారాన్ని ఖండిస్తూ సంఘీభావం తెలిపేందుకు వారంతా వచ్చారు.

కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాలతో 50మంది సైనికులు జలియన్‌వాలాబాగ్ లోకి ప్రవేశించి బయటకు వెళ్లే దారులన్నీ మూసివేశారు. అక్కడ గుమిగూడిన వారిపై విచక్షణ రహితంగా 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. బయటకి వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా కొందరు పార్కు గోడలపైకి ఎక్కేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకేశారు.

బ్రిటీష్ రికార్డుల ప్రకారం నాటి ఘటనలో 379 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నా... దాదాపు వెయ్యి మంది వరకు బలైపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏకంగా 1650 రౌండ్ల తూటాలు పేల్చారంటే వారెంత కర్కషంగా వ్యవహరించారన్నది తెలుస్తోంది. జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటన్ విచారం వ్యక్తం చేయడం కాకుండా క్షమాపణలు చెప్పాలని నాడు ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధీకులు, ఇతరులు డిమాండ్ చేస్తున్నారు. 

Similar News