నేను పార్టీ మారడం లేదు: విష్ణుకుమార్ రాజు

సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బాటలోనే మరికొందరు కమలం నేతలు నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Update: 2019-01-22 05:31 GMT

సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బాటలోనే మరికొందరు కమలం నేతలు నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

బీజేపీకి గుడ్ బై చెప్పిన రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన గూటికి చేరారు. ఇటీవల కమలం పార్టీ నుంచి బయటకు వచ్చిన సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. రాజమహేంద్రవరం నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా విజయవాడ చేరుకున్న ఆయన జనసేనలో చేరారు. ఆకుల సత్యనారాయణకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్. ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించిన సత్యనారాయణ తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల, కన్నా లక్ష్మీనారాయణకు మెయిల్ చేశానని తెలిపారు.

పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆకుల సత్యనారాయణ చెప్పారు. పవన్, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారనే నమ్మకం ఉందన్నారు. జనసేనాని నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే పూర్తి విశ్వాసం తనకుందని సత్యనారాయణ తెలిపారు.

ఆకుల సత్యనారాయణ పార్టీ వీడటంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొందరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన బీజేపీకి వచ్చిన నష్టమేమి లేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇటీవల ఏపీలో బీజేపీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని విష్ణుకుమార్ రాజు తెలిపారు.

రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరడంతో బీజేపీకి దూరమైన నాటి నుంచి కొనసాగిన సస్పెన్స్ కి తెరపడింది. అయితే, ఏపీలో మరికొందరు బీజేపీ నేతలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం కమలం పార్టీని కలవర పెడుతోంది. 

Similar News