వాద్రా కేసులో మౌనం వీడిన ప్రియాంక

Update: 2019-02-06 12:42 GMT

మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీఏ ఛైర్‌పర్సన్ అల్లుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా సాగుతున్న విచారణలో వాద్రాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 42 ప్రశ్నలు సంధించారు. లండన్‌లో వాద్రా ఆస్తులకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు ఈడీ అధికారులు చూపించినట్లు సమాచారం. అయితే ఈడీ విచారణకు తన భర్తను ప్రియాంకా గాంధీ స్వయంగా ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కార్యాలయం దగ్గర డ్రాప్ చేయడం విశేషం.

రాబర్ట్ వాద్రా లండన్‌లో 19 లక్షల పౌండ్ల విలువైన ఆస్తికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లండన్‌లో ఈ ఆస్తితోపాటు 90 లక్షల పౌండ్ల విలువైన మరో రెండు ఇళ్లు, ఆరు ఇతర ఫ్లాట్స్ కూడా వాద్రా పేరుతో ఉన్నట్లు ఈడీ చెబుతోంది. ఈ కేసులో వాద్రాకు ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 16 వరకు ముందస్తు బెయిల్ జారీ చేసింది. మరోవైపు రాబర్ట్ వాద్రాపై ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రియాంక గాంధీ స్పందించారు. నిజా నిజాలేంటో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. భర్తకు అండగా ఉంటానని చెప్పారు.

Similar News