హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో వేధిస్తున్న పార్కింగ్ సమస్య

Update: 2019-04-18 13:13 GMT

హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణం మాటేమోగాని, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. పలు స్టేషన్లలో పార్కింగ్ స్థలాలు లేవు, పార్కింగ్ ఉన్నచోట్ల అడ్డదిడ్డంగా వాహనాలు నిలిచివుంటున్నాయి. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నా పాట్లు తప్పకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైల్ పార్కింగ్‌ అంటేనే హైదరాబాద్ వాసులు హడలిపోతున్నారు. ఏ స్టేషన్ వద్ద చూసినా రెండు వైపుల భారీగా వాహనాలు పార్కింగ్ చేసి ఉంటాయి. కొన్ని స్టేషన్లలో అడ్డగోలుగా వాహనాలు నిలిపివుంచడంతో తమ వాహనం ఎక్కడ పెట్టాలో తెలియక తల పట్టుకుంటున్నారు ప్రయాణికులు.

నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 56 కిలోమీటర్ల మేరకు రెండు కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి. ఆయా మెట్రో స్టేషన్లలో పూర్తిగా పార్కింగ్ సదుపాయాలు లేవు. కేవలం రెండు రూట్లలో 17 పార్కింగ్‌ స్థలాలను మాత్రమే ఏర్పాటుచేశారు. అనేక చోట్ల పార్కింగ్‌ స్థలాలు మెయిన్ రోడ్డుకు అనుకొనే ఉన్నాయి. పార్కింగ్ స్థలాల్లో షెడ్ లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ఎండలో ఎండుతున్నాయి. వానలో తడుస్తున్నాయి. దుమ్ము కూడా చేరుతుండడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.

కొద్ది రోజులుగా మెట్రో రైల్వే స్టేషన్ పక్కన వాహనం నిలబెడితే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. రెండు గంటల బైక్ పార్కింగ్ కు 5 రూపాయలు, కారుకు 12 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ పార్కింగ్ ఫీజును బాదేస్తున్నారు. బైక్ డెయిలీ పాస్‌ ఏడు గంటలకుగాను 15 రూపాయలు, నెల పాస్ కు 250 రూపాయలు, కారు ఏడు గంటలకుగాను 40 రూపాయలు, మంత్లీ పాస్‌ కు 750 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు.

నాగోలు, ఉప్పల్, హబ్బిగూడ, ప్యాట్ని భారీ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఎల్బీ నగర్ మార్గంలో కొన్ని స్టేషన్లలో మాత్రమే పార్కింగ్ స్థలం ఉంది. రద్దీ మార్గం కావడంతో ఇక్కడి ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వరకు ఫీడర్ ట్రాన్స్ ఫోర్టు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ , నాగోల్ చోట్ల ఉదయం పది గంటలలోపే పార్కింగ్ నిండిపోతోంది. ఆ తరువాత వచ్చే వాహనాలు నిలిపేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో ప్రయాణం అందుబాటులోనికి వచ్చింది అని నగర వాసులు సంతోషపడుతుంటే, పార్కింగ్ కష్టాలు వెక్కిరిస్తున్నాయి. పార్కింగ్ సమస్య తీర్చి మెట్రో జర్నీని మరింత ఆనందమయం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.  

Similar News