భారత రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత

Update: 2019-01-29 05:05 GMT

కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూశారు. స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా ఫెర్నాండెజ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

1930 జూన్ 3న కర్నాటకలోని మంగళూరులో ఫెర్నాండెజ్‌ జన్మించారు. కార్మిక సంఘాల్లో కీలకంగా పనిచేశారు. 1967లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంతో జాతీయ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. ఆ తర్వాత జనతాదళ్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఆపై సమతా పార్టీని స్థాపించారు. నాటి ప్రధాని వాజ్ పేయి హయంలో రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలను కూడా నిర్వహించారు.

2009 ఆగస్టు నుంచి 2010 జులై వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఫెర్నాండెజ్‌ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 88 ఏళ్ల ఫెర్నాండెజ్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు స్వైన్ ఫ్లూ సోకింది. స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఫెర్నాండెజ్‌ మరణించారు. ఫెర్నాండెజ్ మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. 

Similar News