జనసేన-టీడీపీపై దాడి వీరభద్రరావు సంచలన ఆరోపణలు

Update: 2019-04-12 14:03 GMT

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఏపీలో 76.69శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇది ఇలా జనసేన, టీడీపీపై వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అభ్యర్థులంతా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చిట్ట చివరి నిమిషంలో అధికార పార్టీ టీడీపీకి సహకరించారని ఆరోపించారు. శుక్రవారం విశాఖపట్నంలో దాడి వీరభద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్ ను పక్కనపెట్టి జనసేన గెలిచేందుకు సహకరించాలని నారా లోకేష్ నేతలకు సూచించారని సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ టీడీపీ నాయకులు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు సంయమనంతో వ్యవహరించారని ప్రశంసించారు. ఏపీలో మార్పు తీసుకొస్తున్నామన్న భావన ఓటర్ల కళ్లల్లో కనిపించిందని అన్నారు.

ఏపి ప్రజల ఓట్లను కిరణాషాప్ లో సామానులాగా కొనేందుకు టీడీపీ విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసిందని వీరభద్రరావు ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ వీధి రౌడీలా ప్రవర్తించారని అధికారం ఉందని ఎన్నికల అధికారులను బెదిరించారని మండిపడ్డారు. కేవలం నారా చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే అసహనానికి గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50లక్షల మంది ఓట్లను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో పచ్చచొక్కలతో వెళ్లి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు అడిగారని తెలిపారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులు రిగ్గింగ్ కు ప్రయత్నించారని ఆరోపించారు.

Similar News