ఈసీతో బాబు ఫైట్

Update: 2019-04-13 06:34 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లను కలవనున్నారు. ఈవీఎంలు మొరాయించడం, సైకిల్ కు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు పడటం వంటి ఘటనలను ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించనున్నారు. చంద్రబాబుతో పాటు కళా వెంకట్రావు, యనమల తదితర ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనకు రావాలని పలువురు మంత్రులకు కూడా పిలుపు వెళ్లింది. టీడీపీ ఎంపీలందరూ చంద్రబాబు వెంట ఉండనున్నారు.

వీవీప్యాట్‌ల మొత్తం లెక్కపెట్టడానికి ఆరు రోజుల సమయం ఎందుకు పడుతుందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. వీవీప్యాట్‌లోని స్లిప్‌లు లెక్కించడానికి ఆరు గంటలు మించదని చెప్పారు. గతంలో బ్యాలెట్‌ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. దీనిపై దేశ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఏకధాటిగా రెండు గంటలపాటు యంత్రం పని చేయకపోతే రీపోలింగ్‌కు అవకాశముందన్నారు. మరోవైపు, ఈసీ వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేపట్టే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ రివ్యూ పిటిషన్ ను కూడా వేయబోతోంది. 

Similar News