అమిత్‌ షా కాదు.. అతనో అబద్ధాల షా: చంద్రబాబు

Update: 2019-02-22 05:27 GMT

రాజమహేంద్రవరం బీజేపీ సభలో నిన్న అమిత్‌ షా చేసిన విమర్శలు, ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా అవాకులు, చవాకులు మాట్లాడారని టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌‌లో అన్నారు. ఏపీకి గత 5 ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేకపోయినా 90 శాతం హామీలు అమలు చేసేసినట్లు అమిత్ షా చెప్పడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. ఆయన అమిత్ షా కాదనీ అబద్దాల షా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం బీజేపీ నేతల్లో లేదన్న చంద్రబాబు రెచ్చగొట్టి, బాధపెట్టి ఆనందం పొందుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ, అమిత్ ఏపీపై పగ- ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్‌తో వైసీపీ అధినేత లాలూచీ పడ్డారని ఆరోపించిన చంద్రబాబు కేసుల మాఫీ కోసం జగన్ కమలం పార్టీకి సహకరిస్తున్నారని అన్నారు.

పుల్వామా ఆత్మాహుతి దాడి విషయంలో తాను పాక్ ప్రధానిని సమర్ధిస్తున్నట్లు అమిత్‌ షా చెప్పడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులపై గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని చంద్రబాబు అన్నారు. గుజరాత్ సీఎంగా మోడీ నాటి ప్రధాని మన్మోహన్ పై ఏం మాట్లాడారో బీజేపీ నేతలు గుర్తు చేసేుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. మోడీ మాటల్ని తాను ఇప్పుడు ప్రస్తావిస్తే బీజేపీ నేతలు తప్పుడు భాష్యం చెబుతున్నారని చంద్రబాబు మండి పడ్డారు. 

Similar News