ఈవీఎంల ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టుకు విపక్షాలు

Update: 2019-04-14 11:55 GMT

వీవీప్యాట్ స్లిప్పుల్ని 50శాతం లెక్కించాల్సిందేనంటున్నాయి విపక్షాలు. ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని మళ్లీ బ్యాలెట్ పద్దతిని పాటించాల్సిందేనంటున్నాయి. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమైన ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలలో లోపాలపై నేతలు చర్చించారు. ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే కారణంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్‌ పద్ధతిని వినియోగిస్తున్నాయని గుర్తుచేశాయి. బ్యాలెట్‌ పద్ధతిలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి వీవీప్యాట్‌ స్లిప్పులను 50శాతం లెక్కించాలని డిమాండ్ చేశాయి. లేకుంటే దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని పేర్కొన్నాయి.

ప్రజస్వామ్య పరిరక్షణ, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంపై ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆప్‌ నేతలు కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలలో లోపాలపై సాంకేతిక నిపుణులతో చర్చించారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయినా తాను దేశం కోసం పోరాడుతున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేది తన తపన అన్నారు. ఏపీ ఎన్నికల్లో వేలాది మెషీన్లు మొరాయించాయని మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయలేదన్నారు. అయినా ప్రజలు ముందుకు వచ్చి ఓట్లేసి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని చెప్పారు చంద్రబాబు.

మరోవైపు ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించడమే తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఎలాంటి పరిశీలనా లేకుండా లక్షలాది ఓటర్లు తొలగిస్తున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలనేది తమ డిమాండ్‌అని చెప్పారు. ఎన్నికల సంఘం బీజేపీ దిశానిర్దేశంలో కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని నేతలు సూచించారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ విధానమే ముద్దని నేతలంతా తేల్చి చెప్పారు.  

Similar News