రోజూ బయటకెళ్తుంటే దేవాన్ష్ అడిగేవాడు.. నా కష్టం తెలియాలనే ఇక్కడికి తీసుకొచ్చా : చంద్రబాబు

Update: 2019-04-07 12:09 GMT

నందిగామ టీడీపీ ప్రచార సభలో ఒకే వేదికపై తాతా మనవడు కనిపించారు. తాను పడుతున్న కష్టం తన మనవడికి చిన్ననాటి నుండే తెలియాలని దేవాన్ష్‌ను సభకు తీసుకొచ్చినట్టు చంద్రబాబు తెలిపారు. టీడీపీ జెండా పట్టుకుని దేవాన్ష్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సభకు కోడలు బ్రాహ్మణి కూడా హాజరయ్యారు. మనవడు దేవాన్ష్‌ను సభకు తీసుకురావడానికి గల కారణాన్ని చంద్రబాబు తెలిపారు.

ఈ సభకు బయలుదేరే ముందు తాతయ్య ఎక్కడికి వెళ్తున్నావ్? అని మనవడు దేవాన్ష్ తనను అడిగాడని చంద్రబాబు చెప్పారు. తన కష్టం ఏంటో మనవడికి తెలియాలని చెప్పే ఈ సభకు దేవాన్ష్‌ని తీసుకొచ్చానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పిల్లలంతా తనకు మనవళ్లు, మనవరాళ్లతో సమానమని, పేద పిల్లలందరినీ ఇంజనీర్లు, డాక్టర్లు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

ప్రపంచానికే సేవలందించే స్థాయికి ఏపీ యువత ఎదగాలని, ఇంటర్ విద్యార్థులకు ఐ ప్యాడ్, ల్యాప్‌టాప్ లు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. పిల్లలందర్నీ బడికి పంపించాలని, వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత తనదని అన్నారు. పిల్లల చదువుకు ఏడాదికి 18వేల రూపాయలు ఇస్తానని వివరించారు. దేవాన్ష్‌ ఒక్కడే కాదు.. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే అని చంద్రబాబు తన మనసులో మాటను చెప్పారు. 

Similar News