కుటుంబ ప్రచార చిత్రం

Update: 2019-04-02 01:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం పతకాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారం ముగియటానికి ఓ వైపు గడువు దగ్గరపడుతుంటే మరోవైపు ప్రధానపార్టీల అధినేతలతో పాటు కుటుంబసభ్యులు సైతం ప్రచారరంగంలోకి దిగి తమతమ పార్టీలకు ఉడతాభక్తిగా సాయం చేస్తున్నారు. ఓటరు దేవుళ్లకు కుటుంబ ప్రచార చిత్రాన్ని చూపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత క్లిష్టమైన ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధానపార్టీల ప్రచారం మరింత జోరందుకొంది. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలను చుట్టిరావడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఓటర్లను కలవటానికి టీడీపీ అధినేత చంద్రబాబు,వైసీపీ అధినాయకుడు జగన్, జనసేనాని పవన్ హెలీకాప్టర్లను వాడుతున్నారు.

మరోవైపు చంద్రబాబు, జగన్, పవన్ ల తరపున వారి కుటుంబసభ్యులు సైతం ప్రచారం చేస్తూ తమవంతు సాయం చేస్తున్నారు. అధికార టీడీపీ తరపున అధినేత చంద్రబాబు తన వయసును సైతం పక్కన పెట్టి వివిధ నియోజకవర్గాలను చుట్టి వస్తూ ప్రచారం చేస్తున్నారు.

కోడికత్తి పార్టీకి ఓటు వేసి చారిత్రక తప్పిదం చేయవద్దంటూ ఓటర్లను హెచ్చరిస్తున్నారు. మరోవైపు సీఎం తనయుడు, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి లోకేశ్ తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకొంటూనే పలు నియోజకవర్గాలలో ప్రచారం చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ వరుసగా రెండోసారి విజయం కోసం ప్రచారం జోరును పెంచారు. అంతేకాదు బాలకృష్ణ తరపున ఆయన సతీమణి వసుంధర సైతం హిందూపురం వార్డుల్లో ఇల్లిల్లు కలియతిరుగుతూ దోశెలు వేస్తూ ఓట్లు అడుగుతున్నారు.

ఇక నెల్లూరు సిటీ అభ్యర్థి , మంత్రి నారాయణతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, సోదరుడు సైతం నెల్లూరులోని వివిధ డివిజన్లలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి నారాయణ చిన్నకుమార్తె సింధూర, గంటా శరణ్య ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకఆకర్షణగా నిలుస్తున్నారు.

ఇక వైసీపీ నేత జగన్ నియోజకవర్గాలలో విస్త్రుతంగా ప్రచారం చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ప్రచారం చేయని నియోజకవర్గాలలో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారం ప్రారంభించారు. షర్మిల గుంటూరు జిల్లాలలోని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాగా విజయమ్మ ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్ర నియోజకవర్గాలలో ప్రచారం చేస్తూ న్యాయాన్ని , ధర్మాన్ని గెలిపించాలంటూ ఓటర్లను వేడుకొంటున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ సైతం అధికార, ప్రతిపక్ష నేతలకు దీటుగా వివిధ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తూ తన ఉనికిని చాటుకోగలుగుతున్నారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన నాగబాబు మాత్రం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అంతేకాదు తనతండ్రి తరపున ఎన్నికల ప్రచారం లో పాల్గొంటానని నాగబాబు కుమార్తె నిహారిక ప్రకటించింది. మొత్తం మీద ఆ పార్టీ ఈపార్టీ అన్న తేడాలేకుండా మొత్తం మూడు ప్రధానపార్టీల అధినేతలు, వారివారి కుటుంబసభ్యులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచార చిత్రాన్ని రక్తికట్టించగలుగుతున్నారు. 

Full View

Similar News