కాబోయే సీఎం, కాబోయే పీఎం..: మాయా, పవన్‌ల వ్యాఖ్యలు

Update: 2019-04-03 11:01 GMT

ఒకరు కాబోయే సీఎం, మరొకరు కాబోయే పీఎం. ఈ మాటలు అన్నది మరెవరో కాదు. పవన్ సీఎం అవుతారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అంటే మాయావతి పీఎం అవుతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జోస్యం చెప్పారు. విశాఖపట్నంలో ఇరు పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో జనసేన కూటమి తప్పక విజయ పతాకం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీఎస్పీ అధినేత మాయావతి విశాఖలో భేటీ అయ్యారు. బీఎస్పీతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉందని పవన్‌ తెలిపారు. మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే తన కల అన్నారు. ఏడాదిగా బీఎస్పీతో చర్చలు జరుగుతున్నాయని, ఆ కల ఇన్నాల్టికి నెరవేరిందన్నారు. దళితులను సీఎం చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఆ వాగ్ధానాన్ని సీఎం విస్మరించారని పవన్‌ గుర్తు చేశారు. దళితుడిని సీఎం చేయకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉందన్నారు. 2014లో పరిస్థితుల రీత్యా.. బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేయాల్సి వచ్చిందని పవన్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాయావతి సీఎం అయితేనే దేశం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందన్నారు జనసేన అధినేత.

ఇదిలా ఉంటే ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీఎస్పీ అధినేత్రి.. యూపీ మాజీ సీఎం మాయావతి అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ రెండిట్లోనూ జనసేన కూటమి విజయవంతం అవుతుందని, రాష్ట్రంలో తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కాబోయే సీఎం పవన్‌ కల్యాణ్‌ అని జోస్యం చెప్పారు మాయావతి. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్‌ వలలో పడొద్దని సూచించారు మాయావతి. ఏపీ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని, పవన్‌ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆమె తెలియచేశారు. 

Similar News