తరుముకొస్తున్న ఎన్నికలతో హోరెత్తిన ప్రచారం..

Update: 2019-03-30 11:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం టాప్ గేర్ లో పడింది. ఓ వైపు ఎన్నికలు తరుముకొస్తుంటే మరోవైపు ప్రధానపార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాలను చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకోడానికి నానాపాట్లు పడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బీజెపీ తరపున ప్రచారానికి దిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన వన్ మ్యాన్ ఆర్మీ పవన్ కల్యాణ్ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత భీకరమైన ఎన్నికల సమరానికి గడువు దగ్గర పడుతున్న కొద్దీ వివిధపార్టీల అధినేతలు ప్రచారహోరు పతాకస్థాయికి చేరింది. నవ్యాంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మరికొద్ది రోజుల్లో జరిగే ఈ ఎన్నికల బరిలో బీజెపీ తరపున ప్రచారం కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే రంగం లోకి దిగారు.

కర్నూలు వేదికగా జరిగిన ప్రచార సభలో ప్రసంగించారు. ఏపీ సీఎం చంద్రబాబు పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. బాబు పాలనలో అంతాఅవినీతేనని, జమాఖర్చుల లెక్కలు అడిగే సరికి యూటర్న్ తీసుకొన్నారని విమర్శించారు. కేంద్రపథకాలపై తన బొమ్మతో స్టిక్కర్లు వేసుకొనే స్టిక్కర్ల బాబు అంటూ విసుర్లు విసిరారు. మరోవైపు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష వైసీపీని లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఓటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని 31 కేసులు ఉన్న జగన్ కు ఓటు ఎందుకు వేయాలంటూ నిలదీస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆడినమాట తప్పిందని, తమను ఘోరంగా మోసం చేసిందని వాపోయారు.

ఇక వైసీపీ అధినేత జగన్ మాత్రం చంద్రబాబు నిర్వాకాలను ఎండగడుతూ ప్రచారం సాగిస్తున్నారు. మడకశిర ఎన్నికల సభలో పాల్గొన్నారు.గత ఐదేళ్ల లో బాబువల్ల రాష్ట్రానికి జరిగిన లాభం ఏమీలేదని అన్ని వర్గాలను చంద్రబాబు వంచించారని, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెబుతూ మాయ చేస్తున్నారని మరికొద్దిరోజుల్లోనే తమ ప్రభుత్వం వస్తుందని ఓటర్లకు జగన్ భరోసా ఇస్తున్నారు.

అంతేకాదు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సైతం ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. ప్రకాశం జిల్లాలో విజయమ్మ, గుంటూరు జిల్లా మంగళగిరిలో షర్మిల ప్రచారం నిర్వహించారు. న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో అందరూ జగన్ ను ఆదరించాలంటూ విజయమ్మ కోరారు.ఇక సీఎం తనయుడు నారా లోకేశ్ బరిలోకి దిగిన మంగళగిరి నియోజకవర్గం నుంచే జగన్ సోదరి షర్మీల ధాటిగా ప్రచారం మొదలు పెట్టారు. బాబు పాలనలో ఆంధ్రప్రజలకు ఒరిగింది ఏమీలేదని బాబుకు బైబై చెప్పాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, నంద్యాల ఎన్నికల సభల్లో ప్రచారం నిర్వహించారు. తాను సీమలో జన్మించకపోయినా తనలో సీమ పౌరుషం ఉందని తనపై విమర్శలు చేస్తున్న జగన్ జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని రెండేళ్లపాటు జైలులో ఉన్న వాస్తవాన్ని గుర్తుంచుకొంటే మంచిదని పవన్ సలహా ఇచ్చారు. మొత్తం మీద టీడీపీ, వైసీపీ, బీజెపీ, జనసేన పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం నామమాత్రంగా సాగిపోతోంది.

Similar News