కొద్దిసేపట్లో చంద్రగ్రహణం.. దీన్ని తోడేలు చంద్రగ్రహణం అంటారు ఎందుకో తెలుసా?

Update: 2020-01-10 16:04 GMT

దశాబ్దిలో మొదటి చంద్రగ్రహణం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ గ్రహణం తొలుత భారత దేశంలోనే కనబడబోతోంది. తరువాత మిగిలిన ఆసియా దేశాల్లో అటు తరువాత మిగిలిన ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహనాన్ని ఊల్ఫ్ (తోడేలు) చంద్రగ్రహణం అని పిలుస్తున్నారు. అసలు చంద్రగ్రహణం అంటే చంద్ర గ్రహణమే కదా.. తుపాన్లకు పెట్టినట్టు ఈ పేర్లేమిటి? మరీ విచిత్రంగా తోడేలు పేరు చంద్ర గ్రహణానికి పెట్టడమేమిటనే అనుమానం మనలో ఉంటుంది కదా.. దాని నివృతి కోసం ఈ కథనం..

జనవరి 10 (కొద్దిసేపట్లో) 10.37కి చంద్రగ్రహణం మొదలవుతుంది. 12.30కి పూర్తిస్థాయికి చేరుతుంది. జనవరి 11 తెల్లవారు జాము 2.42కి చంద్రగ్రహణం ముగుస్తుంది. గ్రహణ సమయంలో... చందమామకూ, సూర్యుడికీ మధ్య భూమి వస్తుంది. భూమి అడ్డుగా రావడం తో సూర్యుడి కాంతి చందమామపై పడదు. అందువల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్దగా కనిపించదు. కానీ, దేశవ్యాప్తంగా చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఇండియాతోపాటూ... ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, సూర్యగ్రహణాన్ని చూడాలంటే క్లిష్టమైన వ్యవహారం. దానికోసం ప్రత్యేక గ్లాసెస్ అవసరం. డైరెక్టుగా చూడలేం. అదే చంద్రగ్రహణమైతే తనివితీరా చూడొచ్చు. అందుకే సంపూర్ణంగా ఉన్న చంద్రుణ్ని ఇవాళ మనం గ్రహణం వచ్చినట్లుగా చూడగలం. ఇవాళ వచ్చే చంద్రగ్రహణం పాక్షికమైనది. అందువల్ల చందమామ పూర్తిగా కనుమరుగు అవ్వదు. చాలా ప్రాంతాల్లో ఇది కనపడదు కూడా. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశాలు తక్కువే. కోల్‌కతాలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ వేత్తలు తెలిపారు. 2020లో మొదటి గ్రహణం ఇదే. నెక్ట్స్ జూన్ 5, జులై 5, నవంబర్ 30న కూడా చంద్ర గ్రహణాలు ఉన్నాయి.

ఈ చంద్ర గ్రహణాన్ని ఇంగ్లీష్‌లో '' ఉల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్'' అని పిలుస్తున్నారు. ఇందులో తోడేలు పదం ఎందుకు చేరిందన్నది ఆసక్తికరం. ప్రస్తుతం అమెరికాలో చలి ఎక్కువ. విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. అందువల్ల జంతువులకు ఆహారం దొరకదు. తోడేళ్లైతే... ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి వచ్చి గట్టిగా అరుస్తాయి. అందువల్ల జనవరిలో కనిపించే చంద్రుణ్ని ఊల్ఫ్ మూన్ అని పిలుస్తారు. అందువల్ల ఇప్పుడు వచ్చే చంద్ర గ్రహణాన్ని తోడేలు చంద్రగ్రహణం అంటున్నారు. అదండీ విషయం.

Tags:    

Similar News