నామినేషన్ల ఘట్టం.. నేటితో సమాప్తం..

Update: 2018-11-19 07:11 GMT

ఉత్కంఠను అంతకుమించి ఆసక్తిని రేపిన తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం అయిన నామినేషన్ల పర్వం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నెల 12 న మొదలైన నామినేషన్ల పర్వం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి భారీగా అభ్యర్థులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

నిన్న రాత్రి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలయ్యాయి. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎవరిని దించాలన్న దానిపైనా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. చివరి నిమిషంలో బీ ఫామ్స్‌ ఇచ్చే అవకాశాలుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. 

ఇప్పటికే టిక్కెట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న ఆశావహుల్లో చాలావరకు రెబల్స్‌గా పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో వారు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఇటు మహాకూటమితో పాటు ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి దక్కని వారిని బుజ్జగింపు చర్యలు కూడా తుదిదశకు వచ్చాయి. అయితే పార్టీ పెద్దల మాటలు వినని వారంతా స్వతంత్రులుగా పోటీకి సిద్ధపడే అవకాశాలున్నాయి. 

మరోవైపు ఇవాళ కార్తీక సోమవారం అందునా ఏకదశి కావడంతో సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేవారికి కూడా మంచి రోజు కావడంతో నిన్నటి నుంచి చేతిలో బీ ఫామ్స్‌ పట్టుకున్న వారు కూడా ఇవాళే వాటిని ధాఖలు చేసే అవకాశం ఉంది. ఇలా రకరకాల కారణాలతో చివరిరోజున పెద్ద సంఖ్యలో నామపత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక రేపు స్క్రూట్నీ నిర్వహిస్తారు. 22 న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆ తర్వాతే ఎన్నికల బరిలో నిలిచేదెవరో తేలిపోనుంది. 
 

Similar News