అమరుల త్యాగాలమయం... తెలంగాణ అవతరణం

Update: 2018-06-01 12:26 GMT

భారతదేశ చరిత్రలోనే అదో కీలకఘట్టం. అరవై ఏళ్ల భాషా ప్రయుక్త రాష్ట్రం రెండుగా విడిపోయిన సందర్భం. ఒక్క జాతి... రెండు రాష్ట్రాలైన సన్నివేశం. స్వతంత్ర భారతంలో రెండు తెలుగు రాష్ట్రాలు అవతరించిన వేళా విశేషం. ఎన్నో ఆటుపోట్లు... మరెన్నో అడ్డంకుల తర్వాత స్వరాష్ట్రం స్వప్నం సాకారం సమయం. ఉద్యమాలు, ఆత్మత్యాగాలు, అగ్గి రాజేసిన అతివాదాలు... ఎన్నో మలుపులు, మరెన్నో అడ్డంకులతో తెలంగాణ చివరకు ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అదే జూన్‌2. 

ఆత్మగౌరవ పోరాటం ఒకరిది. అస్థిత్వ ఆరాటం మరొకరిది. 60 ఏళ్ల కల సాకరమైన వేడుక. నాలుగుకోట్ల మంది ఆకాంక్షలకు ప్రతీక. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన సమయమది. చిరకాల స్వప్నం ఫలించిన సందర్భమది. అమరుల త్యాగాలు అజరామరమైన వేళా విశేషమది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా పరిణగిస్తూ లోక్‌సభ ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసిన తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ నాట్యం చేసింది. నా తెలంగాణ... ప్రగతి రాగాల వీణ అంటూ సగౌరవంగా దేశపటంలో స్థానం సంపాదించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘ కసరత్తులు, తర్జనభర్జనల తర్వాత అత్యున్నత స్థాయిలో ఆమోదం లభించింది. అప్పటిదాకా లేచి కూచున్న తెలంగాణ.. తీన్మార్‌ ఆడింది. విజయోత్సవాలను జరుపుకుంది. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంగా తీర్మానిస్తూ పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని నాటి యూపీయే సర్కార్‌ పదిలంగా అందించింది.

తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయింది. సరిహద్దుల వివాదం, జలవివాదాలు, శాంతిభద్రతల నిర్వహణ, సీమాంధ్రుల రక్షణ, ఆర్థిక, విద్యుత్ పంపిణీ, చాలాకాలం నుంచి తెలంగాణలో స్థిరపడిన ఇతర ప్రాంతీయులు భద్రత, హైదరాబాద్‌ సంబంధిత విషయాలపై అధ్యయనం చేసి... ప్రత్యేక రాష్ట్రానికో రూపం ఇచ్చారు నాటి పాలకులు. 

దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన ప్రత్యేక రాష్టర సాధనలో తెలంగానాన్ని ఆలపించక తప్పని పరిస్థితి అప్పటి రాష్ట్ర నాయకులది. కాంగ్రెస్‌, తెలుగుదేశం సహా వామపక్షాలు కూడా తెలంగాణ కోసం నినదించేలా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ది. మొత్తానికి తెలంగాణ కల సాకారమైంది. ఇది చరిత్రాత్మకం. అరుదైన సన్నివేశం. ఇది తెలంగాణ ప్రజల విజయం. అమరుల త్యాగాల ఫలితం. 

Similar News