నేర చరిత్ర ఉన్న నేతలకు సుప్రీం ఝలక్

Update: 2018-09-25 06:47 GMT

నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సుప్రీం ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తెలిపారు. వచ్చే నెల 2 న పదవీ విరమణ చేయనున్న దీపక్ మిశ్రా కీలక కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయ అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, ఈ విషయంలో పార్లమెంటులో కఠిన చట్టాలను చేయాల్సి ఉందని పేర్కొంది. రాజ్యాంగ సవరణ, కొత్త చట్టాలు తెస్తేనే, నేర చరితులను రాజకీయాలకు, ఎన్నికలకు దూరంగా ఉంచవచ్చని తెలిపింది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమపై ఉన్న పెండింగ్ కేసులను తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే చార్జిషీట్‌ ఉన్నంత మాత్రాన ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించలేమని స్పష్టం చేసింది. 

రాజకీయాల్లో నేరచరితలుండటం పార్టీలు ఓ ఆస్తిగా భావిస్తున్నాయని ఎన్నికలను డబ్బు శాసిస్తోందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ పిటీషన్‌ ను ఈ సందర్భంగా ధర్మాసనం తోసిపుచ్చింది. కేసులున్నా నిరూపితమై జైలు శిక్ష పడేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 

Similar News