రెహానా ఫాతిమాను వీడని కష్టాలు

Update: 2018-10-24 12:21 GMT

శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిని, ఉద్యమకారిణి రెహానా ఫాతిమాపై బదిలీ వేటుపడింది. బోట్‌ జెట్టీ ప్రాంతం నుంచి పబ్లిక్‌ కాంటాక్ట్‌ అంతగా అవసరం లేని కొచ్చిలోని పలరివట్టం ఎక్ఛ్సేంజీకి బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆమె బోట్ జెట్టి బ్రాంచ్‌లో కస్టమర్‌ రిలేషన్‌ సెక్షన్‌లో టెలికాం టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించకపోయినప్పటికీ ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

రెహానాను తొలగించాలంటూ శబరిమల కర్మ సమితి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. అలాగే ముస్లిం కమ్యూనిటీ నుంచి ఆమెను తొలగించినట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ వెల్లడించింది. శబరిమల ఆలయంలో వెళ్లడానికి ప్రయత్నించినందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెహానా ఇంటి మీద దాడి చేసి, ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇతరుల మత సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిందని ఆమె మీద కేసు కూడా నమోదైంది. రెహానా కొంతకాలం మోడల్‌గానూ పనిచేశారు. మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తూ 2014లో వచ్చిన ‘కిస్‌ ఆఫ్ లవ్’ అనే ఉద్యమంలో ఆమె కూడా భాగస్థులు. ఇప్పుడు రెహానాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా బదిలీ చేయడాన్ని ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. 

Similar News