ప్రవేశంపై రాద్ధాంతం... శబరిమలలో ఏంటీ రచ్చ

Update: 2018-10-16 07:57 GMT

శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయంలోకి ఎవరైనా మహిళలు ప్రవేశిస్తే దాడులు చేస్తామని పలువురు హెచ్చరించారు. తిరువనంతపురంలో బీజేపీ ఆందోళన కొనసాగిస్తుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోబోమని కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు.  

10 నుంచి 50ఏళ్ల బాలికలు, మహిళలను అయ్యప్పస్వామి ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నెలవారీ పూజల నిమిత్తం రేపు అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు సిద్ధమయ్యారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి.  

సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకుని అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో భౌతిక దాడులు తప్పవని కొంతమంది హెచ్చరిస్తే, శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. ఆలయం విషయంలో ప్రతిష్టంభన తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కేరళ బీజేపీ అల్టిమేటం జారీ చేసింది.  24 గంటల్లోగా పరిష్కరించకుంటే  ఆందోళనలు ఉధృతం చేస్తామని కమలనాథులు హెచ్చరించారు. 

అయ్యప్పస్వామి ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలు, వర్గాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మహిళలు నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇక కేరళలో రోజురోజుకూ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. పత్తనంమిట్ట జిల్లా పండాలం నుంచి గత వారం బీజేపీ నేతలు ప్రారంభించిన పాదయాత్ర తిరువనంతపురం చేరుకుంది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు అయ్యప్పస్వామి చిత్రాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని, కీర్తనలు ఆలపిస్తూ సెక్రటేరియట్‌ వద్దకు చేరుకున్నారు.  ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. 

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌కు వెళ్లాలంటూ కోరుతున్నారు. అటు కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు తీర్పును అడ్డుకోబోమంటూ గతంలోనే వెల్లడించింది. పైగా కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సీఎం విజయం తప్పుబట్టారు.

శబరిమల ఆలయ ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డ్‌ ఇవాళ సమావేశం కానుంది. వార్షిక మండలమ్‌–మకరవిలక్కు యాత్ర ఏర్పాట్లతోపాటు సుప్రీంకోర్టు తీర్పుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.  శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా,  వివిధ పార్టీలు, సంఘాల ఆందోళనలతో కేరళ ప్రభుత్వానికి విషమపరీక్షగా మారింది. 

Similar News