మళ్లీ వేడెక్కనున్న తమిళనాడు రాజకీయాలు

Update: 2017-12-24 12:37 GMT

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయ్. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో దినకరన్‌ గెలుపుతో రసకందాయంలో పడ్డాయ్. ఉప ఎన్నికల్లో గెలిచి అమ్మకు వారసులం తామేనని అధికార పార్టీ భావించినా భంగపాటు తప్పలేదు. అటు డీఎంకే అభ్యర్థి మరదు గణేశ్‌ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. దినకరన్‌ ఎత్తుల ముందు అధికార, విపక్షాల నేతలు చిత్తయ్యారు. ఉప ఎన్నికల్లో గెలుపుతో అమ్మకు వారసుడు తానేనని నిరూపించుకున్నాడు.

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయ్‌. అమ్మ జయలలిత మృతితో ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దినకరన్‌ తిరుగులేని విజయాన్ని సాధించాడు. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎండ్‌ వరకు ప్రతి రౌండ్‌లోనూ దినకరన్‌ ఆధిక్యం సాధించి తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. ఆర్కే నగర్‌లో గెలిచి దినకరన్‌కు బుద్ధి చెప్పాలనుకున్న అన్నాడీఎంకే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ గెలుపుతో జయలలితకు అసలైన వారసుడు తానేనని దినకరన్‌ నిరూపించుకున్నాడు. అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోకపోవడం అటుంచితే కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 

పార్టీ గుర్తు కోసం లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయినా ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. పోలింగ్‌కు ఒక రోజు ముందు జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను విడుదల చేయించి ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. ఎన్నికల్లో గెలుపుపై మద్దతుగా నిలిచిన ఆర్కేనగర్‌ నియోజకవర్గ ప్రజలకు దినకరన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కోట్ల ప్రజలు, కార్యకర్తల గెలుపన్నారు. అన్నాడీఏంకే మరో మూడు నెలల్లో అధికార పార్టీ హోదాను కోల్పోతోందని దినకరన్‌ జోస్యం చెప్పారు. అమ్మ వార‌సుడిగా ఆర్కేనగర్‌ ప్రజలు తనను ఎన్నుకున్నారని తమదే నిజమైన అన్నాడీఏంకే అని దినకరన్‌ మరోసారి స్పష్టం చేశారు. 

మరోవైపు ఉప ఎన్నికల ఫలితాల్లో తమిళ ఓటర్లు కమలం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి కనీసం నోటాకు వచ్చిన ఓట్లలో మూడో వంతు ఓట్లు కూడా రాలేదు. బీజేపీకి వచ్చిన ఓట్లపై ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. కేంద్రంలో బీజేపీ ఆర్కే నగర్‌ ఉపఎన్నికల్లో రికార్డ్ సృష్టించిందన్న ఆయన బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉప ఎన్నికల్లో ఓటుకు నోటు బాగా పని చేసిందని తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు.

Similar News