జీవించే హక్కుతో పాటు శాశ్వత సెలవుకూ హక్కు

Update: 2018-03-09 10:59 GMT

ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. సమాజంలో గౌరవప్రదంగా బతికిన మనిషి అంతిమ ఘడియల్లో కూడా అదే గౌరవంతో కన్నుమూసే అవకాశాన్ని కల్పించింది. కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో చట్టం వచ్చేదాకా మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. 

జీవించే హక్కుతో పాటు శాశ్వత సెలవుకూ ఇకపై హక్కు
కారుణ్య మరణానికి అనుమతించాలన్న వ్యాజ్యం కొన్నేళ్లుగా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దానిపై సుదీర్ఘంగా విచారించి, వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకున్న సుప్రీంకోర్టు ఎట్టకేలకు కారుణ్య మరణాలకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. కామన్ కాజ్ అనే పేరుతో ముంబైలో పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్ పై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. ప్రాణాంతక రుగ్మతలతో బాధపడుతూ జీవితాన్ని కొనసాగించడం దుర్భరంగా మారినవారు, ఇక జబ్బు నయం కాదని తెలిశాక బెడ్ మీదే నరకయాతన అనుభవిస్తున్నవారు, తోడూ-నీడా ఎవరూ లేకుండా అశక్తులుగా ఉన్నవారు ఇకపై కారుణ్య మరణాన్ని ఎంచుకోవచ్చు. అయితే కారుణ్య మరణాన్ని ఎంచుకునేవారు సజీవ వీలునామా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మానసికంగా, శారీరరకంగా అచేతనావస్థలో ఉన్నవారైతే వారి బంధువుల అభిప్రాయంతో డాక్టర్ల తుది నివేదిక మేరకు వారిని కారుణ్య మరణానికి గురి చేయవచ్చు. 

ముంబైకి చెందిన ఓ వృద్ధ జంట తమకు ముందూ, వెనుకా ఎవరూ లేరని వయసు రీత్యా ముందుముందు తమకు మరింత గడ్డుకాలం సంప్రాప్తిస్తుందని, అందుచేత బాధ తెలియకుండా నిదానంగా తనువు చాలించేలా అనుమతించాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఎప్పట్నుంచో కారుణ్య మరణంపై విచారిస్తున్న కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆ వృద్ధ జంటకు సుఖ మరణం ప్రసాదించినట్లయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
 

Similar News