తెలంగాణ పోరును పవన్‌ ఎందుకు వద్దనుకుంటున్నారు?

Update: 2018-09-11 05:14 GMT

జనసేనతో పొత్తులకు సీపీఎం తహతహలాడుతోంది. ఎన్నికల ప్రచారంలో పవన్‌ పాల్గొంటే పండగేనని లెక్కలేస్తోంది. ఇప్పటికే తమ్మినేని, జనసైనికులతో చర్చలు కూడా జరిపారు. అయితే, తెలంగాణ ఎన్నికల సమరంలో, కమ్యూనిస్టులు ఒకటి తలచితే, పవన్‌ మరోటి తలపోస్తున్నాడా అసలు తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశముందా సీపీఎం పొత్తుకు ఓకే అంటాడా ఎందుకైనా మంచిదని సైలెంట్‌గా ఉండిపోతాడా పవన్‌ మనసులో ఏముంది?

బస్సు యాత్రతో ఆంధ‌్రప్రదేశ్‌ మొత్తం చుట్టేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు, జగన్‌లపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్‌లో కింగ్‌ లేదంటే కింగ్‌ మేకర్‌ అవ్వాలని వ్యూహాలు వేస్తున్నారు జిల్లాజిల్లాలోనూ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, అభ్యర్థుల వడపోత ఇలా ఏపీ ఎన్నికల భేరిలో సత్తా చాటాలని, స్ట్రాటజిక్‌ ప్లాన్‌ వేస్తున్నారు ఇదే సమయంలో, తెలంగాణలో హఠాత్తుగా ఎన్నికలు వచ్చిపడ్డాయి మరి తెలంగాణలో జనసేన పరిస్థితి ఏంటి?

తెలంగాణలో ఇప్పటిదాకా తమ పార్టీ అస్తిత్వంపై దృష్టిపెట్టలేదు జనసేనాని. ముంచుకొచ్చిన ముందస్తు ఎన్నికలకు దూరంగా ఉండాలని దాదాపు నిర్ణయించుకున్నారని, జనసైనికుల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగా, పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తే, అందుకు చాలా కారణాలున్నాయి వ్యూహాత్మక ఆలోచనలున్నాయి ఎన్నికలు అనుకున్న షెడ్యూలు ప్రకారం 2019 మేలో మార్చి, ఏప్రిల్‌లో ఉన్నట్లయితే జనసేన తప్పకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సొంతంగా పోటీచేసి ఉండేదని కానీ ఎన్నికలు ఏడునెలలు ముందుగానే వచ్చిన నేపథ్యంలో, పార్టీ వ్యవస్థీకృతంగా ఇంకా సన్నద్ధంగా లేనందున ఈ ఎలక్షన్స్‌ బరిలోకి దిగకపోవడమే మేలని పవన్ కల్యాణ్‌ భావిస్తున్నారట.

అంతేకాదు, తెలంగాణ పోరులో ఏ పార్టీకి మద్దతివ్వరాదని కూడా, పవన్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కొంతమేర లబ్దిపొందడానికి పవన్ కల్యాణ్ ను కూడా తమతో కలుపుకుని, ఆయన క్రేజ్ ను కూడా వాడుకుని కొన్ని సీట్లయిన గెలవాలని సీపీఎం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం- పవన్ ను బహుజన లెఫ్ట్ కూటమిలోకి ఆహ్వానించారు. అందుకోసం రెండు విడతలుగా పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో చర్చలు కూడా జరిపారు. అయితే ఈ డిస్కషన్‌లో, జనసేన నేతలు, ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదని తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో పవన్‌ దూరంగా ఉండటానికి, ఇంకా బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో జనసేన అసలు ఉనికిలో లేదు. పవన్‌ దృష్టి మొత్తం ఏపీ మీదే ఉంది. కానీ మొన్న తెలంగాణలో పవన్‌ పర్యటనలకు, యువత భారీగా తరలివచ్చారు. కానీ ఈ క్రేజ్‌తో ఎన్నికల బరిలోకి దిగితే, మొదటికే మోసమని పవన్‌ మథనపడుతున్నారు. తెలంగాణలో సీపీఎంతో కలిసి పోటీ చేసినా, ఒంటరిగా చేసినా, ఎలాగూ తమ పార్టీ ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదని పవన్ లెక్కలేస్తున్నారు. ఇక్కడ ఓడిపోతే, ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్‌‌లో తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది. పవన్‌ ప్రభావమేమీ లేదని తేలిపోతుంది. అందుకే తమ పార్టీకి అసలు ఎలాంటి ప్రయోజనమూ లేని, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి, ఇబ్బందులు తెచ్చుకోవడం కన్నా, సైలెంట్‌గా ఉండటమే మేలని పవన్‌ ఆలోచిస్తున్నారు.

అంతేకాదు, ఎన్నికల బరిలోకి దిగితే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుంది. కానీ కేసీఆర్‌ సర్కారు విద్యుత్‌ సంస్కరణలపై గతంలో పవన్‌ ప్రశంసలు కురిపించారు. స్వయంగా క్యాంప్‌ ఆఫీసులో కేసీఆర్‌ను కలిసి, పొగిడారు. ఒకప్పుడు పొగిడి, ఇప్పుడు విమర్శిస్తే తన క్రెడిబులిటి దెబ్బతింటుందని అనుకుంటున్నారు. అందుకే, తెలంగాణ పోరులో దూకడం కన్నా, ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా దృష్టిపెట్టడమే మేలని భావిస్తున్నారు పవన్‌. ఇదే జరిగితే, అందరికంటే ఎక్కువ బాధపడేది సీపీఎం పార్టీనే.

Similar News