బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌

Update: 2018-03-28 06:10 GMT

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా మమతా బెనర్జీ స్పీడు పెంచారు. హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం వేగంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీలోని పలు పార్టీల నేతలను కలిశారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌ను తీసుకురావాలన్న ఉద్దేశంతో దీదీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 

థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను వేగవంతం చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. హస్తినలో రాజకీయం నడుపుతున్నారు. నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు విపక్ష ఎంపీలను కలుసుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ కనిమొళిని మమత నిన్న పార్లమెంటులో కలుసుకున్నారు. బీజేయేతర ఫ్రంట్ ఏర్పాటుపై ఈ సమావేశంలో నేతలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కనిమొళికి తాము మద్దతుగా నిలుస్తామని, తమిళనాడులో డీఎంకే అధికారంలో వస్తుందని కూడా మమత చెప్పారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు మమత. రాహుల్ ను కూడా త్వరలోనే కలుస్తానని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగడతామని థర్డ్‌ ఫ్రంట్‌ను ఉద్దేశించి అన్నారు. దేశంలో బీజేపీని మించిన మతతత్వ పార్టీ లేదని మోడీ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వకూడదంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని మమత చెప్పారు.
   
యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌నూ కూడా మమతా బెనర్జీ కలుసుకోనున్నారు. సోనియాని ఆమె బుధవారంనాడు కలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బేజీపీయేతర రాజకీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చే విషయంలో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని కలుసుకున్నారు.

Similar News