పోలీసులను ఉరుకులు పెట్టించిన మంద కృష్ణమాదిగ

Update: 2017-12-18 05:58 GMT

కనివిని ఎరుగని రీతిలో భారతి సంస్మరణ సభ జరుగుతుందని చెబుతూ వచ్చిన మంద కృష్ణమాదిగ నిజంగానే ప్రభుత్వాన్ని, పోలీసులను ఉరుకులు పెట్టించారు. ఎవరూ ఊహించని విధంగా ట్యాంక్ బండ్ ముట్టడికి పిలుపునిచ్చాడు. దీంతో వేలాది మంది ఉవ్వెత్తున ఎగసిపడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి సంస్మరణ సభ సిక్ విలేజ్‌లో ఆదివారం సాయంత్రం 4గంటలకు మొదలైంది. 7గంటలకు మంద కృష్ణమాదిగ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 

సరిగ్గా రాత్రి 10గంటలకు సంస్మరణ సభ ముగుస్తుందనుకుంటున్న సమయంలో ఉద్వేగపూరితంగా ఊహించని పిలుపు. మనం మిలియన్ మార్చ్‌కు బయలుదేరుతున్నాం. ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడిన కవితమ్మకు లేని అనుమతి మనకెందుకు శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిద్దాం. ఎవరు అడ్డగించినా భయపడాల్సిన పనిలేదని మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. 

ఈ హఠాత్ పరిణామంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ర్యాలీని ఆపడం కోసం ఆగమేఘాల మీద హైదరాబాద్ పోలీసులంతా సిక్ విలేజ్‌కు చేరుకున్నారు. ఆందోళనకారులను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పోలీసులను తోసుకుని ముందుకు సాగారు. 

ముందు వరుసలో మంద కృష్ణమాదిగ నడవగా.. ఆయనకు మాదిగ యువసేన రక్షణగా నిలిచింది. ఆఖరికి పాత రాంగోపాల్ పేట్ వద్ద 10గంటల 50 నిమిషాలకు మంద కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులు అడుగడుగునా అడ్డంపడ్డారు. ఈ తోపులాటలో ఇద్దరు మహిళలు స్పృహకోల్పోయారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

పోలీసుల చర్యలతో రెచ్చిపోయిన ఆందోళనకారులు రాంగోపాల్ పేట్ ఇన్‌స్పెక్టర్ వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రాణిగంజ్, బాంబే హోటల్, రాంగోపాల్ పేట్, ప్యారడైజ్ కూడలిలో ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావుతోపాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని అర్ధరాత్రి ఒంటిగంట దాకా పరిస్థితిని సమీక్షించారు. అయితే, గాంధీ ఆస్పత్రికి తరలించిన ఇద్దరు మహిళలను ఒకటిన్నర సమయంలో ముందస్తు జాగ్రత్తగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మహబూబాబాద్‌కు చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Similar News