ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్ర భగ్నం

Update: 2018-11-11 05:00 GMT

మరో 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పొలింగ్‌ ఉండగా మావోయిస్టులు భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. కూంబింగ్ బలగాలే లక్ష్యంగా దంతేవాడ జిల్లాలో భారీ కుట్రకు వ్యూహరచన చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు గుర్తించడంతో మావోయిస్టుల కుట్రభగ్నమైంది. దంతేవాడ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ బలగాలే లక్ష్యంగా  పదడుగులు గొయ్యి తవ్వి భారీగా మందుపాతరలను ఏర్పాటు చేశారు. కాలి బాటలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు భారీ మట్టి కుప్ప కనిపించడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. సమీపంలో భారీ గొయ్యిని పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు ఉండటంతో నిపుణుల సాయంతో నిర్వీర్యం చేశారు.  

మావోయిస్టల ప్రాబల్య ప్రాంతమైన దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను బహిష్కరించాలని ఇప్పటికే పిలుపునిచ్చిన మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ తేది నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మావోయిస్టుల విధ్వంసంలో 12 మంది భద్రతా సిబ్బంది, నలుగురు పౌరులు, ఒక డీడీ కెమెరామెన్‌ చనిపోగా ... 30 మంది గాయపడ్డారు. దీంతో పాటు బీజేపీ నేత  నంద్ లాల్ ముదాంబీపై గత నెల 28న దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి బయటిపడిన ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

Similar News