పద్మభూషణ్ అవార్డుకు ధోనీ పేరును ప్రతిపాదించిన బీసీసీఐ

Update: 2017-09-20 16:16 GMT

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ధోనీ పేరును పరిగణనలోకి తీసుకుని... సముచిత ప్రాధాన్యం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి చెప్పారు. ఎన్నో అద్భుత విజయాలు ధోనీ సొంతమని, పద్మ భూషణ్ అవార్డుకు ఎంఎస్ అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు. ధోనీ అభిమానులు కూడా కచ్చితంగా పద్మభూషణ్ వస్తుందని ఆశిస్తున్నారు. ధోనీ ట్రాక్ రికార్డ్ కూడా అవార్డుకు తగిన వాడేనని నిరూపిస్తున్నాయి. 90 టెస్ట్ మ్యాచుల్లో 4876 పరుగులు చేసిన ధోనీ 224 పరుగుల అత్యుత్తమ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు.

ఇక వన్డేల విషయానికొస్తే 302 వన్డే మ్యాచులు ఆడిన ధోనీ 9737 పరుగులు చేశాడు. 78 టీ20 మ్యాచ్‌ల్లో 1212 పరుగులు, 159 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ధోనీ 3561 పరుగులు చేశాడు. ఇప్పటికే ధోనీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ధోనీకి పద్మభూషణ్ ఇస్తే.. ఈ అవార్డు అందుకున్న 11వ భారత క్రికెటర్‌గా ధోనీ నిలవనున్నాడు. సచిన్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి మేటి క్రీడాకారులతో పాటు మరో ఏడుగురు ఇప్పటివరకూ పద్మ భూషణ్ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.

Similar News