వాజ్‌పేయి ఆరోగ్యం విషమం

Update: 2018-08-16 03:01 GMT

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం మరింత క్షీణించింది. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని, గత 24 గంటల్లో ఆయన పరిస్థితి మరింత దిగజారిందని బుధవారం రాత్రి 10.15 గంటల సమయంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొంది. మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాజ్‌పేయిది గట్టి మనోబలం. ఇంతకాలం ఆయన అనారోగ్యంతో పోరాడుతున్న తీరుకు మేమే ఆశ్చర్యపోతున్నాం’ అని ఎయిమ్స్‌లో పనిచేస్తున్న తెలుగు వైద్యుడు ఒకరు చెప్పారు. బీజేపీ చాలా చోట్ల తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News