అహ్మదాబాద్‌ ఇకపై కర్ణావతి..పేరు మార్చనున్న గుజరాత్ సర్కార్!

Update: 2018-11-07 08:57 GMT

అహ్మదాబాద్‌ పేరును ‘కర్ణావతి’గా మార్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ గుజరాత్‌ ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గాంధీనగర్‌లో మీడియా ప్రతినిధులతో పటేల్‌ మాట్లాడుతూ అహ్మదాబాద్‌ పేరు మార్చేందుకు భాజపా ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. భారత్‌లో ప్రపంచ వారసత్వం అనే ట్యాగ్‌ ఉన్న ఒకే ఒక్క నగరం పేరును మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే వార్తలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించారు. ‘అహ్మదాబాద్‌ పేరును కర్ణావతిగా మార్చాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అందుకు తగిన మద్దతు, చట్టపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతే ఆ నగరం పేరు మార్చేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం’ అని ఆయన తెలిపారు. సరైన సమయం చూసి పేరు మారుస్తామని చెప్పారు. 11వ శతాబ్దంలో అహ్మదాబాద్‌ అశ్వాల్‌గా పేరొందిన ప్రాంతం. ఆ తర్వాత దాన్ని కర్ణావతిగా మార్చారు. కానీ సుల్తాన్‌ అహ్మద్‌షా కర్ణావతి ప్రాంతాన్ని అహ్మదాబాద్‌గా మార్చారు.కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ ముఖ్య పట్టణం అలహాబాద్‌ పేరును ప్రయాగరాజ్‌గా,  ఫైజాబాద్‌ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News