IT Hiring: విప్రో షాక్.. ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఫ్రెషర్లను నడిరోడ్డుపై వదిలేస్తారా? కేంద్రానికి ఫిర్యాదు!

విప్రో ఐటీ కంపెనీ ఆఫర్ లెటర్స్ ఇచ్చి కూడా ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. దీనిపై ఐటీ యూనియన్ NITES కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సుమారు 250 మంది అభ్యర్థులు జాయినింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Update: 2026-01-20 06:24 GMT

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించామన్న ఆనందంతో ఉన్న వందలాది మంది ఫ్రెషర్ల ఆశలపై ఐటీ దిగ్గజం విప్రో (Wipro) నీళ్లు చల్లింది. ఆఫర్ లెటర్స్ చేతికి ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఆన్‌బోర్డింగ్‌లో తీవ్ర జాప్యం చేస్తూ అభ్యర్థులను అయోమయంలోకి నెట్టేసింది. ఈ వ్యవహారంపై ఐటీ ఉద్యోగుల సంఘం 'నైట్స్' (NITES) ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

ఆఫర్లు ఇచ్చారు.. కానీ విధుల్లోకి తీసుకోలేదు!

విప్రో సంస్థ నిర్వహించిన టర్బో, నెక్ట్స్ జెన్ టాలెంట్ హైరింగ్ వంటి డ్రైవ్‌ల ద్వారా దాదాపు 250 మంది ఫ్రెషర్లు ఎంపికయ్యారు. వీరిలో ఎక్కువ మందికి 2025 మే నెలలోనే 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' జారీ చేశారు.

వేచి చూడడమేనా?: ఎంపికైన అభ్యర్థులకు ప్యాకేజీ వివరాలు, వర్క్ లొకేషన్, జాయినింగ్ డేట్ వంటి అన్ని వివరాలను కంపెనీ పంపింది.

వెరిఫికేషన్ పూర్తి: కంపెనీ సూచించిన విధంగా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సహా అన్ని డాక్యుమెంట్ ప్రక్రియలను అభ్యర్థులు పూర్తి చేశారు. అయినప్పటికీ, ఉద్యోగంలో చేర్చుకునే విషయంలో విప్రో నుంచి ఉలుకూ పలుకూ లేదు.

'నైట్స్' పోరాటం.. కేంద్రానికి లేఖ!

ఈ జాప్యంపై ఐటీ యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఘాటైన లేఖ రాసింది. విప్రో తక్షణమే ఆ అభ్యర్థులకు జాయినింగ్ డేట్స్ ఇచ్చేలా ఆదేశించాలని కోరింది.

అభ్యర్థుల ఆవేదన: "విప్రో ఆఫర్ ఇచ్చింది కదా అని నమ్మి ఇతర కంపెనీల ఇంటర్వ్యూలను వదులుకున్నాం. ఇప్పుడు ఇటు ఉద్యోగం లేక, అటు వేరే దారి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం" అని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించని కంపెనీ: అభ్యర్థులు ఎన్నిసార్లు మెయిల్స్ చేసినా, కంపెనీని సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐటీ రంగంలో సంక్షోభం.. విప్రోకు ఎదురుదెబ్బలు!

ఇటీవలే విప్రో తన క్యూ3 ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 7 శాతం తగ్గడంతో మార్కెట్‌లో కంపెనీ షేరు విలువ 10 శాతం మేర పతనమైంది. ఆదాయాలు తగ్గడం, ప్రాజెక్టులు తగ్గిపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఐటీ కంపెనీలు ఇలా ఆన్‌బోర్డింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇన్ఫోసిస్ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోగా, సుదీర్ఘ కాలం తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంది. మరి విప్రో ఫ్రెషర్ల భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News