SIP: నెలకు రూ. 7వేలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 3కోట్లు మీ సొంతం.. ఎలాగో తెలుసా?

SIP: నెలకు రూ. 7వేలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 3కోట్లు మీ సొంతం.. ఎలాగో తెలుసా?

Update: 2025-12-30 05:11 GMT

SIP: ప్రతి ఉద్యోగి.. తన కెరీర్ చివరి దశలో రిటైర్మెంట్‌ను ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా గడపాలని కోరుకుంటాడు. ముఖ్యంగా డబ్బు కొరత లేకుండా, కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలంటే ముందుగానే సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. రిటైర్మెంట్ తర్వాత కూడా నెలవారీ ఖర్చులు, వైద్య అవసరాలు, జీవన ప్రమాణాలు కొనసాగాలంటే పెద్ద మొత్తంలో సేవింగ్స్ ఉండాలి. అందుకే చాలామంది తమ రిటైర్మెంట్ నాటికి కోట్ల రూపాయల ఫండ్ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు.

మీరు కూడా రిటైర్మెంట్ సమయానికి సుమారు 3 కోట్ల రూపాయల కార్పస్ నిర్మించాలనుకుంటే.. ఇప్పటి నుంచే క్రమబద్ధమైన పెట్టుబడులు ప్రారంభించాలి. దీనికి మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక మంచి మార్గంగా భావించవచ్చు. SIP విధానంలో ప్రతి నెల ఒక నిర్ధిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావం వల్ల పెద్ద మొత్తంలో ఫండ్ తయారవుతుంది.

SIP ముఖ్యమైన లాభం ఏమిటంటే.. స్టాక్ మార్కెట్‌పై పూర్తి అవగాహన లేకపోయినా కూడా చిన్న మొత్తాలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. నెలకు కేవలం రూ.100 నుంచే SIP మొదలుపెట్టే అవకాశం ఉంది. ప్రతి నెల కొంత మొత్తం సేవ్ చేయడం అలవాటుగా మారడంతో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని దీర్ఘకాలంలో సమతుల్యం చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.. రాహుల్ అనే వ్యక్తి 25 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ మొదలుపెట్టాడనుకుందాం. అతను ప్రతి నెల రూ.7,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో SIP ద్వారా పెట్టుబడి పెట్టాడు. వార్షికంగా సగటు 12 శాతం రాబడి వస్తుందని ఊహించుకున్నాడు. ఇలా అతను నిరంతరంగా 33 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాడు.

ఈ కాలంలో రాహుల్ పెట్టిన మొత్తం పెట్టుబడి సుమారు రూ.27.72 లక్షలు మాత్రమే. అయితే కాంపౌండింగ్ ప్రభావం వల్ల అతనికి వచ్చిన లాభం సుమారు రూ.2.78 కోట్లకు పైగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే, అతని వద్ద రిటైర్మెంట్ నాటికి దాదాపు రూ.3 కోట్లకు మించిన ఫండ్ సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లకు సంబంధించినవే. కాబట్టి మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రాబడుల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఇక్కడ చెప్పిన లెక్కలు కేవలం అంచనాల మాత్రమే. పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి వ్యవధిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సరైన సమయంలో, క్రమంగా పెట్టుబడులు ప్రారంభిస్తే రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా, ప్రశాంతంగా జీవించే అవకాశం తప్పకుండా ఉంటుంది.

Tags:    

Similar News