SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు మీవే.. పూర్తి వివరాలివే..!!

SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు మీవే.. పూర్తి వివరాలివే..!!

Update: 2025-12-30 09:56 GMT

SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకే పరిమితం కాకుండా, తన ఖాతాదారులకు అనేక అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. ముఖ్యంగా SBIలో శాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగులకు అందిస్తున్న భీమా రక్షణ ఇప్పుడు విస్తృతంగా చర్చకు వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ భీమా కవరేజీ ఏకంగా కోటి రూపాయల వరకు అందిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SBIతో ఒక కీలక ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు SBIలో శాలరీ అకౌంట్ నిర్వహిస్తే చాలు, వారికి ప్రమాద భీమా స్వయంచాలకంగా వర్తిస్తుంది. ఇందుకోసం ఉద్యోగులు ఎలాంటి అదనపు ప్రీమియం లేదా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పథకం స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ (SGSP) కింద అమలవుతోంది. దీనిలో భాగంగా, SBIలో శాలరీ అకౌంట్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగి సేవలో ఉండగానే ప్రమాదవశాత్తు మరణిస్తే, అతడి కుటుంబానికి గరిష్టంగా రూ.1 కోటి వరకు భీమా పరిహారం అందజేస్తారు. ఇది ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా పెద్ద భరోసాగా నిలుస్తోంది. ఈ పథకం అమలుకు వచ్చిన తర్వాత తొలి ఉదాహరణగా ఎక్సైజ్ శాఖలో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు కుటుంబం నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా నందివాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పిచ్చేశ్వరరావు గత ఏడాది జూలైలో ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన SBIలో శాలరీ అకౌంట్ కలిగి ఉండటంతో SGSP కింద ప్రమాద భీమా వర్తించింది.

అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక SBI ఇటీవలే రూ.1 కోటి భీమా మొత్తాన్ని విడుదల చేసింది. ఈ చెక్కును స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిచ్చేశ్వరరావు భార్య వెంకటదుర్గకు అందజేశారు. SBIతో ఒప్పందం కుదిరిన తర్వాత ఈ పథకం కింద కోటి రూపాయల భీమా అందుకున్న తొలి కుటుంబం ఇదే కావడం గమనార్హం.

ఈ ప్రమాద భీమాతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అమల్లో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో ఈ స్కీమ్ కింద క్యాష్‌లెస్ వైద్య సేవలు పొందవచ్చు. SBI ప్రమాద భీమా ఈ ఆరోగ్య పథకానికి భిన్నమైనదని, ఇది కేవలం ఉద్యోగికి సంబంధించిన ప్రమాద మరణాలకే వర్తిస్తుందని అధికారులు వివరించారు.

అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మరో ముఖ్యమైన పథకం ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (APSEGIS). ఈ స్కీమ్ అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి. ఉద్యోగి జీతం నుంచి ప్రతినెల కొంత మొత్తాన్ని ఈ పథకం కింద కట్ చేస్తారు. సేవలో ఉండగా ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి భీమా రక్షణ లభిస్తుంది. అలాగే ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఇప్పటివరకు చెల్లించిన మొత్తం వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా డెత్ బెనిఫిట్స్‌తో పాటు సేవింగ్స్ ప్రయోజనాలు కూడా అందుతాయి. SBIతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరింత భద్రత లభిస్తోంది. ముఖ్యంగా ప్రమాదవశాత్తు జరిగే అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి కుటుంబానికి కోటి రూపాయల వరకు భీమా అందడం ఒక కీలక ఆర్థిక రక్షణగా నిలుస్తోంది.

Tags:    

Similar News