CIBIL Score: క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే.. సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా? ఇందులో నిజమెంత..?
CIBIL Score: క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే.. సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా? ఇందులో నిజమెంత..?
CIBIL Score: చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారుల వద్ద ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటాయి. కాలక్రమంలో కొన్ని కార్డులు వాడకం లేకుండా పాతబడిపోతాయి. అప్పుడు వాటిని క్లోజ్ చేయడం మంచిదా? అలా చేస్తే సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.
క్రెడిట్ కార్డును మూసివేస్తే ముందుగా ప్రభావం చూపేది మొత్తం క్రెడిట్ లిమిట్‌పై. మీ వద్ద ఉన్న అన్ని కార్డుల కలిపిన క్రెడిట్ లిమిట్‌లో ఒక కార్డు తీసివేయబడితే, మొత్తం లిమిట్ తగ్గిపోతుంది. దీనివల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) మారుతుంది. సాధారణంగా మీకు ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే వినియోగిస్తే అది ఆరోగ్యకరమైన స్థాయి గా పరిగణిస్తారు. కానీ లిమిట్ తగ్గిన తర్వాత అదే ఖర్చు చేస్తే, యుటిలైజేషన్ శాతం పెరుగుతుంది. ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం సిబిల్ స్కోర్‌ను తగ్గించవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి మొత్తం రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి. అతను నెలకు రూ.20,000 ఖర్చు చేస్తే యుటిలైజేషన్ 20 శాతం ఉంటుంది. కానీ ఆ కార్డుల్లో ఒకదాన్ని క్లోజ్ చేయడం వల్ల లిమిట్ రూ.70,000కి తగ్గితే, అదే రూ.20,000 ఖర్చు చేసినా యుటిలైజేషన్ దాదాపు 29 శాతానికి చేరుతుంది. ఇది స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది. అంతేకాదు, కార్డును క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ సగటు కాలపరిమితి కూడా తగ్గే అవకాశం ఉంటుంది, ఇది కూడా స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
అయితే క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన వెంటనే స్కోర్ భారీగా పడిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. కొంతకాలం తాత్కాలికంగా తగ్గినప్పటికీ, సకాలంలో బిల్లులు చెల్లించడం, క్రెడిట్ వినియోగాన్ని నియంత్రణలో ఉంచడం ద్వారా మళ్లీ స్కోర్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ముఖ్యంగా ఇతర కార్డులపై ఖర్చు పెంచకుండా జాగ్రత్తపడాలి.
ఇక వాడని క్రెడిట్ కార్డుల విషయంలో బ్యాంకులు కూడా చర్యలు తీసుకుంటాయి. సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం కార్డు ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగకపోతే, ఆ కార్డును క్లోజ్ చేయడానికి బ్యాంకులు ప్రక్రియ ప్రారంభిస్తాయి. అయితే నేరుగా మూసివేయకుండా ముందుగా కార్డు హోల్డర్‌కు సమాచారం ఇస్తారు. నిర్దిష్ట గడువులో స్పందన రాకపోతే కార్డును క్లోజ్ చేస్తారు. కాబట్టి మీకు అవసరమైన కార్డు అయితే, సంవత్సరంలో కనీసం ఒక్కసారి అయినా చిన్న ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా యాక్టివ్‌గా ఉంచుకోవడం మంచిది.
మొత్తంగా చూస్తే, అవసరం లేని కార్డులను మూసివేయడం కొన్నిసార్లు మంచిదే అయినా, దాని వల్ల క్రెడిట్ లిమిట్, యుటిలైజేషన్ రేషియో, సిబిల్ స్కోర్‌పై పడే ప్రభావాన్ని ముందే అంచనా వేసుకోవాలి. సరైన ప్లానింగ్‌తో చేస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు, లేకపోతే స్కోర్‌పై అనవసర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.