Digital Gold: డిజిటల్ గోల్డ్‎లో ఇన్వెస్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..!!

Digital Gold: డిజిటల్ గోల్డ్‎లో ఇన్వెస్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..!!

Update: 2025-12-30 09:13 GMT

Digital Gold: 2025వ సంవత్సరం బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీలాభాలను తెచ్చి పెట్టింది. సంవత్సరంలో ఎక్కువ కాలం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతో బలహీనంగా కనిపించినప్పటికీ.. బంగారం ధరలు మాత్రం వరుసగా కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ భౌతిక బంగారంతో పాటు డిజిటల్ బంగారంపై కూడా పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది.

NPCI విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో డిజిటల్ బంగారానికి సంబంధించి సుమారు 940.5 మిలియన్ లావాదేవీలు జరిగాయి. నవంబర్ నెల నాటికి ఈ లావాదేవీల మొత్తం విలువ రూ. 12,471 కోట్లను దాటడం గమనార్హం. ఈ సంఖ్యలు చూస్తే, పెట్టుబడిదారులు వేగంగా డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతుంది.

డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం కావడమే దీనికి ప్రధాన కారణం. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి భద్రపరచాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్ ద్వారానే బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఇది ఇస్తుంది. చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు రూ.10 కన్నా తక్కువ మొత్తంతోనూ డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇంటి నుంచే కొనుగోలు, విక్రయం చేయగలగడం పెట్టుబడిదారులకు పెద్ద సౌకర్యంగా మారింది.

ప్రస్తుతం Paytm, PhonePe, Google Pay, Amazon వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కళ్యాణ్ జ్యువెలర్స్, తనిష్క్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ ఆభరణాల సంస్థలు కూడా ఈ సేవను అందిస్తున్నాయి. ఈ సంస్థలు పెట్టుబడిదారుల తరపున భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి, బీమా కలిగిన సురక్షిత వాల్ట్‌లలో నిల్వ చేస్తాయి. అవసరమైతే డిజిటల్ బంగారాన్ని భౌతిక బంగారంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

అయితే డిజిటల్ బంగారానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఆనంద్ రతి వెల్త్ మ్యూచువల్ ఫండ్స్ విభాగాధిపతి శ్వేతా రజని మాట్లాడుతూ, డిజిటల్ బంగారం ధరలు ఎక్స్చేంజ్‌లో ట్రేడయ్యే ETFలు లేదా ఇతర నియంత్రిత ఉత్పత్తుల మాదిరిగా బహిరంగ మార్కెట్లో నిర్ణయించబడవని తెలిపారు. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో ప్లాట్‌ఫామ్‌లు కొనుగోలు–అమ్మక ధరల మధ్య వ్యత్యాసాన్ని పెంచవచ్చని, దీంతో అమ్మక సమయంలో పెట్టుబడిదారులకు ఆశించిన ధర లభించకపోవచ్చని ఆమె హెచ్చరించారు.

ఇదే విషయంపై SEBI కూడా నవంబర్‌లో పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. డిజిటల్ బంగారం నియంత్రిత పెట్టుబడి సాధనం కాదని, గోల్డ్ ETFలు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలాగా SEBI పర్యవేక్షణ ఉండదని స్పష్టం చేసింది. పారదర్శక నియమాలు లేకపోవడం వల్ల ఇందులో పెట్టుబడులకు కొన్ని రిస్కులు ఉన్నాయని నియంత్రణ సంస్థ హెచ్చరించింది.

డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఛార్జీలను కూడా గమనించాలి. కొనుగోలు సమయంలో ప్లాట్‌ఫామ్ మార్జిన్‌తో పాటు 3% GST చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ₹10,000 విలువైన డిజిటల్ గోల్డ్ కొంటే, అదనంగా స్ప్రెడ్ మరియు పన్నుల రూపంలో కొన్ని వందల రూపాయలు ఖర్చవుతాయి. అమ్మకం సమయంలో కూడా 2–3 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్ప్రెడ్ వర్తించవచ్చు. భౌతిక బంగారంగా మార్చుకునే సందర్భంలో తయారీ ఛార్జీలు, డెలివరీ ఖర్చులు, GST వంటి అదనపు భారాలు ఉంటాయి. ఈ విషయాలు చాలామంది పెట్టుబడిదారులకు మొదట తెలియకపోవచ్చు.

పన్నుల పరంగా చూస్తే, డిజిటల్ బంగారం అమ్మకంపై మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. 24 నెలల లోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణించి, వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. 24 నెలలు దాటిన తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను విధించబడుతుంది.మొత్తానికి 2025లో బంగారం పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినా, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేముందు దాని లాభాలు, పరిమితులు, ఛార్జీలు, నియంత్రణ అంశాలను పూర్తిగా అర్థం చేసుకుని ముందడుగు వేయడం పెట్టుబడిదారులకు ఎంతో అవసరం.

Tags:    

Similar News