Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వ్రతం.. ఈ 7 నియమాలు పాటిస్తే అపార పుణ్యం!

ముల్లోకాలను పరిపాలించే శ్రీమహావిష్ణువును ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) రోజున భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్త విశ్వాసం.

Update: 2025-12-29 14:30 GMT

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వ్రతం.. ఈ 7 నియమాలు పాటిస్తే అపార పుణ్యం!

ముల్లోకాలను పరిపాలించే శ్రీమహావిష్ణువును ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) రోజున భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్త విశ్వాసం. ఈ పవిత్ర దినాన దేశవ్యాప్తంగా విష్ణాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. క్షీరసాగర మథనం జరిగి అమృతం ఉద్భవించిన మహత్తర ఘట్టం కూడా ఇదే రోజున చోటుచేసుకుందని పురాణాలు చెబుతున్నాయి.

డిసెంబర్‌ 30 (మంగళవారం)న జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఆచరించి, లక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువును షోడశోపచార విధితో పూజించి, దీక్షతో రాత్రి జాగరణ చేస్తే అనంత పుణ్యఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, ద్వాదశి రోజున అతిథి లేకుండా భోజనం చేయరాదనేది సంప్రదాయం. ఏకాదశి ఉపవాసం వల్ల పాప విముక్తి కలుగుతుందని విష్ణుపురాణం స్పష్టం చేస్తోంది.

ఉపవాసం అంటే ఏమిటి?

ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే ఉండటం. అంటే భగవంతునికి దగ్గరవ్వడమే ఉపవాసం యొక్క అసలైన అర్థం. వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో నివసిస్తాడని పురాణ విశ్వాసం. అందుకే ఆ రోజున బియ్యంతో చేసిన ఆహారాన్ని తినరాదని చెబుతారు. ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మిగతా 23 ఏకాదశుల పుణ్యం లభిస్తుందని విష్ణుపురాణ వాక్యం.

ముర అనేది తామసిక గుణాలు, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఉపవాసం, జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణం వృద్ధి చెంది ముక్తికి మార్గం ఏర్పడుతుంది. ఒక రోజు ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతి లభించడమే కాక ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా మారుతుంది.

వైకుంఠ ఏకాదశి – ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ప్రత్యేకం?

ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కలగడం అంటే వైకుంఠ ప్రవేశానికి సంకేతంగా భావిస్తారు. ఈ రోజున దర్శనం చేసుకున్నవారికి జన్మజన్మాంతర బంధనాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం.

ఏకాదశి వ్రతంలో పాటించాల్సిన 7 ముఖ్య నియమాలు

దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి

ఏకాదశి రోజంతా ఉపవాసం ఆచరించాలి

అబద్ధాలు ఆడకూడదు

చెడ్డ ఆలోచనలు, దుష్ట కార్యాలకు దూరంగా ఉండాలి

స్త్రీ సాంగత్యాన్ని నివారించాలి

ముక్కోటి ఏకాదశి రాత్రి పూర్తిగా జాగరణ చేయాలి

అన్నదానం చేయాలి

ద్వాదశి రోజున భగవతారాధన ముగించుకుని పారాయణ చేసి, బ్రాహ్మణులకు దక్షిణ-తాంబూలాలతో సత్కరించడం శుభప్రదం. ఉపవాసం చేయలేనివారు పాలు, నెయ్యి, నీరు, పండ్లు, నువ్వులు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు.

వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం, గోసేవ, దానధర్మాలు మోక్షప్రాప్తికి దోహదపడతాయి. ఇవన్నీ సాధ్యం కాకపోయినా ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనుకున్న కార్యాలు సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

తాత్త్విక సందేశం

విష్ణువు ఎక్కడో వైకుంఠంలోనే కాదు… ప్రతి మనిషి హృదయ గుహలో పరమాత్మగా ప్రకాశిస్తున్నాడు. దేహమే దేవాలయమని ఉపనిషత్తుల బోధ. ఉపవాసం ద్వారా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసును నియంత్రించి పూజ-జప-ధ్యానాలతో ఆరాధించడమే ఏకాదశి వ్రత పరమార్థం. పదకొండు ఇంద్రియాల ద్వారా చేసే పాపాలను జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి వ్రతమే నాశనం చేయగలదని శాస్త్ర వచనం. అందుకే నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని విశ్వసిస్తారు.

Tags:    

Similar News