Atum 1.0 Bike: ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 100 కిలో మీటర్లు నాన్‌స్టాప్

Atum 1.0 Bike: 100 కిమీ ప్రయాణానికి కేవలం పది రూపాయలే ఖర్చు. పైగా ఈ బైక్ కు రిజిస్ట్రేషన్, లైసెన్స్ కూడా అవసరం లేదు.

Update: 2021-03-09 15:58 GMT

ఆటూమ్ 1.0 ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ (ఫొటో ట్విట్టర్)

Electric bike atum 1.0: అవునండీ... మీరు చదివింది అక్షరాల నిజమే... ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే...100 కిలో మీటర్ల వరకు నాన్‌స్టాప్ గా ప్రయాణించొచ్చు. అలాగే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు రిజిస్ట్రేషన్, లైసెన్స్ కూడా అవసరం లేదంట. మరెందుకు ఆలస్యం... ఆ బైక్ విశేషాలేంటో చూద్దాం...

ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. వాహన సంస్థలు కూడా వీటి ఉత్పత్తిని ఆమాంతం పెంచేస్తున్నాయి. నెలకి రెండు, మూడు మోడల్స్ విపణిలోకి వస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఆటు మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ తన నూతన ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. అదే ఆటూమ్ 1.0 ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్. దీని ధర్ ఎక్స్ షోరూంలో రూ.50,000 లుగా సంస్థ ప్రకటించింది.

ఆటూమ్ 1.0 స్టైల్ గా ఉండి బైక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. పోర్టబుల్ లిథియం అయాన్ బ్యాటరీ తో నడుస్తుంది. దీన్ని కేవలం 4 గంటల్లోనే పూర్తిగా ఛార్జింగ్ ఎక్కించొచ్చని కంపెనీ తెలిపింది. అలా ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే 100 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించవచ్చు.

ఈ బైక్‌తోపాటు విడి భాగాలకు 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి రిజిస్ట్రేషన్ కూడా అవసరముండదు. డ్రైవింగ్ లైసెన్సు కూడా అవసరం లేదంటుంది కంపెనీ. 18 ఏళ్ల లోపు వారు కూడా దీన్ని డ్రైవ్ చేయవచ్చని తెలిపింది.

"మూడు సంవత్సరాల కృషి, పట్టుదలకు ఫలితంగా తయారైందే ఈ ఆటూమ్ 1.0 ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ అని" కంపెనీని స్థాపించిన వంశీ గడ్డం అన్నారు. ఆటూమ్ 1.0 బైక్ ను లాంచ్ చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇండియాను పర్యవరణహితంగా మార్చడంలో ఆటూమ్ 1.0 ఓ మైలురాయిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

దీని బరువు తక్కువగా ఉంటుంది. అలాగే బ్యాటరీ బరువు 6 కేజీలు. ఛార్జింగ్ కోసం ఓ యూనిట్ విద్యుత్ ను వాడుకుంటుంది. అంటే దాదాపు 100 కిలోమీటర్లకు రూ. 7 నుంచి రూ. 10 లు మాత్రమే ఖర్చవుతుంది. అదే సాధారణ కమ్యూటర్ బైక్స్ తో పోలిస్తే (100 కిలోమీటర్లకు రూ.80 నుంచి రూ.100లు) ఇది ఎంతో తక్కువ.

Tags:    

Similar News