Andhra Pradesh: నేడే అమ్మఒడి ప్రారంభం.. జాబితాలో పేర్లు లేకపోతే ఇలా చేయాలి..

Update: 2020-01-09 02:09 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో 'జగనన్న అమ్మఒడి' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలో తన నివాసం నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అక్కడినుంచి నేరుగా విమానం ద్వారా తిరుపతికి చేరుకుంటారు. అక్కడినుంచి 11.15 గంటలకు చిత్తూరులోని పీవీకేఎస్‌ గవర్నమెంట్‌ కాలేజీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి సీఎం చేరుకుని విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. అనంతరం స్థానికంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.45 గంటలకు అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

కాగా అమ్మఒడి పథకంలో పిల్లల్ని బడికి పంపే ప్రతి పేద తల్లి బ్యాంకు అకౌంట్‌లో ఏడాదికి రూ.15 వేలు జమచేస్తారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. అనంతరం ఇంటర్‌ వరకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 42 లక్షల 80 వేల 753మంది అమ్మఒడికి అర్హులుగా గుర్తించారు.. అయితే ఈ జాబితాలో తల్లులు/సంరక్షకుల పేర్లు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.

అర్హులైన వారు ధ్రువీకరణ పత్రాలతో గ్రామ/వార్డు సచివాలయాల దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేసింది. అమ్మఒడి కోసం రూ.6,421 కోట్లు ఇందుకోసం బడ్జెట్ లో కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం అమలుకోసం వివిధ శాఖల నుంచి నిధుల విడుదలకు పాలనా అనుమతులు లభించడంతో. వివిధ శాఖల ఖాతాల నుంచి అమ్మ ఒడి కి రూ. 6 వేల 109 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలావుంటే అమ్మఒడి కి రాష్ట్రంలోని 61,271 స్కూళ్లు, 3,083 కాలేజీలు అర్హత సాధించాయి.

గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News