ఏపీ ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవి కుమార్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

Update: 2019-08-27 13:37 GMT

ఏపీ ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవి కుమార్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వాధికారులతో దుర్భాషలాడడంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు కూన రవి అరెస్ట్‌కు ఆదేశించారు. దీంతో కూన రవి సహా మరో 12 మందిపై సరబుజ్జిలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం జిల్లా సరబుజ్జిలి ఎంపీడీవో కార్యాలానికి వెళ్లారు మాజీ విప్‌ కూన రవి. ప్రభుత్వ ఉద్యోగులతో దుర్భాషలాడారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా నాటకాలు చేస్తే అధికారులను గదిలో పెట్టి బాది, తాళం వేస్తానంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ మాటలు కాస్తా దుమారం కావడంతో దీనిపై వివరణ ఇచ్చారు కూన రవి.

ఎంపీడీవో కార్యాలయం అంశంలో తనమీద వస్తున్న ఆరోపణలపై మాజీ విప్ కూన రవి స్పందించారు. తాను ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి హల్ చల్ చేశానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేవలం ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లానని, అయితే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తాను కార్యాలయానికి వెళ్ళే సరికి అక్కడి ఉద్యోగులు భోజనం చేస్తుండటంతో ఆయన ఎంపీడీవో గదికి వెళ్ళగా ఆ గదికి తాళం వేసి ఉందని దీంతో ప్రత్యేక అధికారి గదిలో కూర్చునేందుకు వెళ్లానని అన్నారు. అయితే ప్రత్యేక అధికారి కుర్చీలో మాజీ జెడ్పీటీసీ భర్త కూర్చుని ఉన్నారని, అందుకే తనని ప్రశ్నించారని వివరణ ఇచ్చారు.

Full View

Tags:    

Similar News