అమ్మఒడి పథకంలో సీఎం జగన్ యూటర్న్ : నాదెండ్ల మనోహర్‌

Update: 2020-01-10 02:01 GMT

ప్రజల దృష్టిని మళ్లించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గురువారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులు వినే తీరికలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని.. అందువల్ల ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఆయనకు అర్హత లేదని విమర్శించారు. అమరావతి కోసం రైతులు కమిటీగా ఏర్పాటై ఉద్యమం చేస్తుంటే.. రైతుల కోసం ఏర్పాటైన అమరావతి పరిరక్షణ కమిటీ బస్సు యాత్రను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు దాని తీవ్రతను ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత జనసేన పార్టీపై ఉందన్న మనోహర్.. అందువల్లే అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. జనసేన పార్టీ మొదటి నుంచి ప్రజా సమస్యల మీద, ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల మీద స్పందిస్తూనే ఉందని స్పష్టం చేశారాయన. గతంలో జనసేన పార్టీ ప్రజల తరఫున చేసే పోరాటాలను కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు.

విశాఖపట్నంలో లాంగ్‌ మార్చ్‌ అనుమతులు ఇవ్వకుండా ఆపాలని చూశారని.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో టమాటా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా ఆపేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మనోహర్ ఆరోపించారు. అంతేకాదు ఇటీవల అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ ను ప్రతి గ్రామం వద్ద పోలీసులు ముళ్ల కంచెలు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెళ్తుంటే ఆ గ్రామాల ప్రజల్ని ఊరు వదిలి వెళ్లిపోమనడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

ఇక రాబోయే వారం రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై జనసేనలో చర్చ జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా రైతులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. అమ్మఒడి పథకం విషయంలో ముఖ్యమంత్రి మాట తప్పారని మనోహర్ వ్యాఖ్యానించారు. ఈ పథకంలో పారదర్శకత లోపించిందని.. ముఖ్యమంత్రి రోజుకో మాట మాట్లాడుతూ రోజుకో మాట మారుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఈ పథకం వ్యవహారంలో యూటర్న్‌ లు తీసుకున్నారని మనోహర్ ఆరోపించారు. 

Tags:    

Similar News