వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని శిలా తోరణం వద్ద నుండి దర్శన క్యూలైన్లలను అధికారులతో కలిసి శనివారం ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం, అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
భక్తుల కొరకు మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు
చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించుకునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ టీటీడీ క్యూలైన్లలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో స్వామివారిని దర్శంచుకోవాలని తెలియజేశారు.
28 నుండి జనవరి 7 వరకు SSD టోకెన్లు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 28 నుండి జనవరి 7వ తేది వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే SSD టోకెన్ల జారీని రద్దు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు
30 నుండి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. తొలి మూడు రోజులు, డిసెంబర్ 30, 31, జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుంది. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి (Time Slot) మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది.