వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లే రాష్ట్రంలో కరోనా.. కాణిపాకలో ప్రమాణం చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

Update: 2020-04-21 14:08 GMT
Kanna Lakshminarayana (File Photo)

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కరోనా రక్షణ కిట్ల విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కరోనా కిట్స్ విషయంలో ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు తనపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్ఠానం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది.. ఎంత దుర్వినియోగం జరిగిందనే ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ విజయసాయి చేసిన ఆరోపణలను కన్నా ఖండించారు.

ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతి బీజేపీది కాదన్నారు. దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో అవినీతి రహిత పాలన సాగుతోందని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పెట్టి అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడేది వైసీపీనే అని ఆరోపించారు. వారంవారం కోర్టుకెళ్లి ప్రమాణం చేయడం, అబద్ధాలు చెప్పడం విజయసాయిరెడ్డికి అలవాటేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద తాను 20కోట్ల రూపాయలు తీసుకున్నానంటూ.. చేసిన ఆరోపణలపై కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తారా? అని విజయసాయికి ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యల బట్టి ఆయన ప్రమాణానికి వస్తారని అనుకుంటున్నానని చెప్పారు. లాక్‌డౌన్‌ పూర్తవగానే తేదీ, సమయం నిర్ణయిస్తానని.. విజయసాయి వచ్చి ప్రమాణం చేయాలని కన్నా కోరారు.

కరోనా కిట్ల వ్యవహారంలో కొనుగోలు లెక్కలపై, మంత్రి, అధికారుల ప్రకటనల్లో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు. భిన్నమైన ప్రకటనల్లో పథకం ప్రకారం ఏదో జరిగినట్లు కనిపిస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. కిట్ల ధర విషయంలో వచ్చిన ఆరోపణలపై పారదర్శకతను నిరూపించుకోవాలని కోరితే, వ్యక్తిగత దూషణలతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని కన్నా విమర్శించారు.

కరోనా కేసులను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని.. దీనిలో తనకెలాంటి సందేహం లేదన్నారు. ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరుగుతోందని కన్నా విమర్శించారు. విజయసాయిరెడ్డి విజయవాడ టూ విశాఖ తిరుగుతున్నారని అన్నారు. ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన తండ్రి మరణించినా వెళ్లలేదని గుర్తు చేశారు. రాజధాని విశాఖకు వెళ్తుందా? లేదా? అనే దానిపై కాలమే సమాధానం నిర్ణయిస్తుందని అన్నారు. 


Tags:    

Similar News