ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై రగడ.. ఛత్తీస్‌గఢ్ రూ.337.. ఏపీలో అంతా?
కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కిట్ల ద్వారా హాట్ స్పాట్‌లలో కరోనా పాజిటివ్ కేసులను త్వరగా గుర్తించే వీలుంది. కాగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో జగన్ సర్కారు అవినీతి తెరతీసిందనే ఆరోపణలు వచ్చాయి.
ఛత్తీస్‌గఢ్ లో ఆక్కడి ప్రభుత్వం ఒక్కో కిట్‌ను రూ. 337కు కొనుగోలు చేస్తే.. ఏపీ ఒక్కో కిట్‌కు 12వందల రూపాయలు ఖర్చు చేసిందని సోషల్ మీడియాలో కొందరు విమర్శించారు. దక్షిణ కొరియా నుంచి 75 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంటున్నామని ఛత్తీస్‌గఢ్ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఒక్కో కిట్‌కు రూ.337 చెల్లిస్తున్నామని ఆయన వెల్లడిచారు. అతి తక్కువ ధరకు వేసిన బిడ్డింగ్ అని దేశంలోనే అతి తక్కువ అని టీఎస్ సింగ్ ప్రకటించారు.
దక్షిణ కొరియా నుంచే ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ కిట్లను పొందుతున్నాయని, అయితే ఏపీలో ఒక్కో కిట్‌కు భారీగా కమిషన్ కొట్టేశారని ఏపీ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టి పారేసింది. ఒక్కో కిట్‌ను దాదాపు 1200రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేసిందనే ప్రచారం నిజం కాదని తెలిపింది. సుమారు రూ.700కు ఈ కిట్లను పొందామని, తుది ధర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ర్యాపిడ్ కిట్ల ధరల విషయంలో ఛత్తీస్‌గఢ్, కేరళ, వంటి రాష్ట్రాలను సంప్రదించమని జగన్ సర్కారు స్పష్టం చేసింది. ఈ విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని స్పష్టం చేసింది.