ఇవాళ్టి నుంచి ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం

ఇవాళ్టి నుంచి ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం
x
Highlights

♦ ఇవాళ వంటావార్పు కార్యక్రమం ♦ ఆర్టీసీ సమ్మెకు వివిధ వర్గాల నుంచి మద్దతు ♦ విద్యార్థీ, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగుల మద్దతు ♦ ఈ మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీతో టీఎన్జీవోల భేటీ ♦ ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపనున్న టీఎన్జీవోలు

ఓ వైపు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతుండగా.. మరోవైపు విధులకు రాని వారితో ఎలాంటి చర్చలుండవని సర్కారు తేల్చిచెప్పింది. ఇటు ఇవాళ్టి నుంచి వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తామని. యూనియన్లు ప్రకటించగా, వచ్చే రెండు రోజుల్లో రోడ్లపైకి వందశాతం బస్సులు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. పట్టువిడుపుల్లేవని ఒకరు.. వెనక్కు తగ్గేది లేదని మరొకరు.. భీష్మించుకోవడంతో.. ప్రయాణీకుల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు.

మరోవైపు ఇవాళ వంటావార్పుతో తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. ఇటు ఆర్టీసీ సమ్మెకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. విద్యార్థీ, మున్సిపల్‌, పంచాయతీ ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. రేపు విద్యార్థీ యూనియన్లు బస్‌ భవన్‌ను ముట్టడించనున్నారు. అలాగే మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు డీపీఓ కార్యలయాల దగ్గర నిరసనలు వ్యక్తం చేయనున్నారు.

ఇక తమ సమ్మెకు మద్దతివ్వాలంటూ ఆర్టీసీ జేఏసీ గత కొన్ని రోజులుగా టీఎన్జీవోలను కోరుతోంది. అయితే నిన్న సాయంత్రం టీఎన్జీవోలు ఆర్టీసీ జేఏసీ నాయకులను సంప్రదించారు. ఇవాళ మధ్యాహ్నం కలుద్దామని ఫోన్‌లో మంతనాలు జరిపారు. దీంతో ఇవాళ టీఎన్జీవోలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవోలు మద్దతు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే సర్కారు మాత్రం ఆర్టీసీ సమ్మెను పట్టించుకోవడం లేదు. అంతేకాదు వచ్చే మూడు రోజుల్లో డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోడ్లపైకి రావాల్సిందే అని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. గూండాగిరి చేస్తే భయపడేది లేదన్నారు. సమ్మె చేసే వారితో ఎలాంటి చర్చల్లేవని మరోసారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న కార్మికులకే సెప్టెంబర్ జీతాలు అందుతాయని స్పష్టం చేశారు. విధులకు రాని వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని తేల్చిచెప్పారు. డిపోలు, బస్టాండ్ల దగ్గర బందోబస్తు పెంచాలని సమ్మె పేరుతో విధ్వంసం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇక సమ్మె నేపథ్యంలో బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో దసరా సెలవులను మరో వారం రోజులు పెంచారు. సెలవులను ఈ నెల 19 వరకు పొడిగించిన సర్కారు ఈ నెల 21 న తిరిగి స్కూళ్లు, కాలేజీలను తెరవనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories