అగ్రరాజ్యం లాంటి పరిస్థితి మన రాష్ట్రానికి తీసుకురావద్దు: హైకోర్టు

అగ్రరాజ్యం లాంటి పరిస్థితి మన రాష్ట్రానికి తీసుకురావద్దు: హైకోర్టు
x
Telangana High Court (file Photo)
Highlights

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ విషయంలో అనుసరిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ విషయంలో అనుసరిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్యులకు మాస్క్‌లు ఇవ్వటం లేదని, కరోనా పరీక్షలు చేయడంలేదని, ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరకుంటున్న వలస కార్మికులకు వసతి కల్పించడం లేదంటూ ఇటీవల హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఆయా పిటిషన్లపైన మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేయిస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అతి తక్కువ మందికి పరీక్షలు చేయిస్తుందని హైకోర్టు మరోసారి గుర్తుచేసింది.

ఐసీఎంఆర్ నిబంధనలు అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పాటించల్లేదని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, జనాభాకు సరిపడ పరీక్షలు చేయకుండా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో ఎంత మందికి కరోనా టెస్టులు చేసారని హైకోర్టు ప్రశ్నించింది. లక్షమంది జనాభాలో కరోనా టెస్టులను ప్రభుత్వం కేవలం 545 మందికి మాత్రమే చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ ఇప్పటి వరకు 24 ,443 మందికి పరీక్షలు నిర్వహించామని ఆయన కోర్టుకు వివరించారు.

కరోనా పరీక్షల నిర్వహణపై రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసిందని, దానిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కోరింది. అడ్వకేట్‌ జనరల్‌ వాదనలతో ఏకభవించని న్యాయస్థానం జూన్ మొదటి వారంలోపు ఎంత మంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్ట్‌లు నిర్వహించారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్రరాజ్యంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుందని, అంత పెద్ద దేశంలోనే లక్ష మంది వైరస్‌ సోకి మృత్యువాడ పడ్డారని దయచేసి అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో కల్పించవద్దని పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories