గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాపై నిపుణుల సూచన

గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాపై నిపుణుల సూచన
x
Tamilisai Soundararajan (File Photo)
Highlights

కరోనా వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవడానికి కరోనాతో మరణించిన వారికీ పరీక్షలు నిర్వహించాలని పలువురు నిపుణులు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు...

కరోనా వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవడానికి కరోనాతో మరణించిన వారికీ పరీక్షలు నిర్వహించాలని పలువురు నిపుణులు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సూచించారు. సోమవారం రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ తమిళిసై కరోనాపై పోరులో అనుసరించాల్సిన వ్యూహంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ రంగాల నిపుణులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిపునులు స్థానిక పరిస్థితుల ఆధారంగా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉండకుండా రాష్ట్రంలో హేతుబద్ధమైన కరోనా నిర్ధారణ పరీక్షల విధానం రూపొందించాలని సూచించారు.

టెస్ట్, ట్రేస్, ట్రీట్‌ మాత్రమే దీర్ఘకాలంపాటు అనుసరించగల వ్యూహమని స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి ఆధారంగా టెస్టింగ్‌ చేపట్టాలని, కాంటాక్టులను సమర్థంగా గుర్తించాలన్నారు. అనంతరం రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు ప్రభుత్వం ఈ సలహాలు, సూచనలు వినియోగించుకునేలా సమగ్ర నివేదికను సమర్పిస్తామని గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా, కేంద్ర వైద్యారోగ్య శాఖ రిటైర్డ్‌ కార్యదర్శి సుజాతరావు, రిటైర్డ్‌ డీజీపీ హెచ్‌జే దొర, అపోలో ఆస్పత్రుల అధ్యక్షుడు డాక్టర్‌ హరిప్రసాద్, ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి, అమెరికాలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న డాక్టర్‌ స్వామినాథన్, ప్లాస్లా థెరపీ ద్వారా కోలుకున్న తొలి రోగి కె. వంశీమోహన్‌ పాల్గొన్నారు.

అందిన సూచనల్లో ముఖ్యమైనవి...

1. పీపీఈ కిట్లు, చేపట్టిన అదనపు పారిశుద్ధ్య చర్యలపై ఆస్పత్రులు చేసిన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలను కోరాలి.

2. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, మీడియా వ్యక్తులు, పోలీసులు, సామాజిక సేవ చేస్తున్న వ్యక్తులు, శానిటరీ కార్మికులు వంటి ఫ్రంట్‌లైన్‌ యోధులకు క్రమం తప్పకుండా పరీక్షలు జరపాలి.

3. మొబైల్‌ పరీక్ష ప్రయోగశాలల సేవలను ఉపయోగించుకోవాలి.

4. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలి.

5. ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధుల జాబితాలో కరోనాను చేర్చాలి.

6. హాట్‌స్పాట్‌లు, రెడ్‌జోన్లలో అందరికీ పరీక్షలు చేయాలి.

7. సామాజిక వ్యాప్తి గుర్తించడానికి యాంటీబాడీ పరీక్షలు జరపాలి.

8 ఆర్టీ–పీసీఆర్‌ టెస్టులను మరింత వేగంగా నిర్వహించాలి.

9. హాట్‌స్పాట్లలో ఒకే కిట్‌తో సామూహిక టెస్టులు చేయాలి.

10. ఆన్‌లైన్‌ కన్సల్టేషన్, టెలి మెడిసిన్‌ సౌకర్యాన్ని మెరుగుపరచాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories