ఎన్నికల పోరు.. వారసుల జోరు..

ఎన్నికల పోరు.. వారసుల జోరు..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 120 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు సహా 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 120 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు సహా 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇక ఈ పట్టణాల్లో తామే విజయం సాధించాలని అన్ని పార్టీల వర్గాలు పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, ఎక్కువ శాతం మునిసిపాలిటీలను గెలుచుకుంటామని గట్టి నమ్మకంతో ఉంది. దీంతో పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మునిసిపాలిటీలలో చైర్‌పర్సన్‌లు, కార్పొరేషన్లలో మేయర్‌ల పదవికి పోటీ చేసే విధంగా తమ బంధువులను ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలిని బరిలో దించగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇదే విధంగా మరో నలుగురు వారసులు ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఇందులో ఎంతమంది పదవులను కైవసం చేసుకుంటారో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదే కోణంలో రామగుండంలో మాజీ ఎమ్మెల్యేల బంధువులు, కుటుంబీకులు పోరులో నిలిచారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కోడలు లావణ్య కార్పోరేషన్‌ ఎన్నికల్లో పోటీచేసారు. ప్రస్తుతం 39వ డివిజన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన లావణ్య, గత ఎన్నికల్లో కూడా పోటీచేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

ఇదే బరిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం ఇద్దరు కొడుకులు కూడా పోరులో దిగారు. కిరణ్‌ 44వ డివిజన్‌, మధు 33వ డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసారు.

నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో మంథని కూడా ఒకటి. ఇందులో భాగంగా అక్కడ కూడా ఎన్నికల పోరు జోరుగానే సాగుతుంది. అధికారాన్ని దక్కించుకోవడానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ లు పోటా పోటీగా ప్రచారాలు కొనసాగిస్తు్న్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు తన భార్య శైలజను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దింపారు.

ఇదే తరుణంలో జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రచారాలు ఆసక్తి కరంగా మారాయి. ఈ జిల్లాలో చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేసారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలు మమతారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 21వ వార్డు నుంచి బరిలో నిలిచారు. దీంతో మమతారెడ్డి డ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాల్లో మొత్తం 36 వార్డులు ఉండగా వాటిలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే రెండు స్ధానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.

ఇదే తరహాలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య కూడా తన భార్య తారను 11వ డివిజన్‌ నుంచి బరిలో దించారు. ఇదే కోణంలో ఎంతో మంది మాజీ జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేల కుటుంబీకులు ఈ ఎన్నికల బరిలో ఉండడంతో అక్కడి ఎన్నికలు ఎంతో ఆసక్తి కరంగా మారాయి. బరిలో దిగిన వారిలో ఎవరు స్థానాన్ని సంపాదించుకోబోతున్నారో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories