Top
logo

ఇదీ మన మంచికే! కరోనా దెబ్బకి కట్టుబాటలో మన సమాజం!

ఇదీ మన మంచికే! కరోనా దెబ్బకి కట్టుబాటలో మన సమాజం!
Highlights

మానవ జీవితం అంటేనే ఎన్నో ఒడిదుడుకుల ప్రయాణం. కష్టం తో దొరికే సుఖం. ఆ సుఖంతో వచ్చే విచ్చలవిడితనం. ఆ పైన మళ్లీ వచ్చే ఇక్కట్లు.

మానవ జీవితం అంటేనే ఎన్నో ఒడిదుడుకుల ప్రయాణం. కష్టం తో దొరికే సుఖం. ఆ సుఖంతో వచ్చే విచ్చలవిడితనం. ఆ పైన మళ్లీ వచ్చే ఇక్కట్లు. ఇది మానవజీవితంలో చక్రంలా తిరిగే సహజమైన చర్య. అయితే ఇబ్బందులు నేర్పించే పాఠాలు అన్నీ ఇన్నీ వుండవు. వాటిని అర్ధం చేసుకుని ఆచరిస్తే ప్రకృతి హర్షిస్తుంది. ఈ ఇక్కట్ల పాఠాలకి కులమతాల ద్వేషాలు.. రాజకీయ విద్వేషాలు వుండవు. సరిగ్గా అటువంటి పాఠాలనే మోసుకొచ్చింది కరోనా వైరస్. మంచి అలవాట్లను మరచి ఆధునిక ఆకర్షణల్లో విలువల వలువలు వదిలేసిన మానవాళికి పాత సంప్రదాయాల బాటను కొత్తగా గుర్తు చేస్తోంది.


చేతులు కడుక్కోవడం..

అప్పట్లో ఇంటికి వచ్చిన ఎవరైనా సరే కాళ్లూ..చేతులు కడుక్కోవడానికి ఇంటి ముందే చెంబుతో నీళ్లిచ్చేవారు..కాలం మారినకొద్దీ ఆ పద్ధతిని గాలికి వదిలేశారు. ఇప్పుడు అందరికీ దాని విలువ తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా పుణ్యమాని ఈ పద్దతి మల్లీ వెలుగులోకి వచ్చింది. ఎవరైనా బయటికి వెల్లి వస్తే చాలు వారు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు.

ఇంటి పనులు స్వయంగా చేసుకోవడం..

ఒకప్పుడు ఎవరి ఇంటి పనులను వారే స్వయంగా చేసుకునే వారు. దగ్గరుండి ఇంటిని చక్కపెట్టుకునే వారు. పనులన్నీ స్వయంగా చేసుకోవడంతో ఆనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ కాలం మారింది, కొంత మంది ఇంటిపనులు చేసుకోవడమే మరిచి పోయారు. ఫలితంగా ఊబకాయం పెరిగి లేని పోని రోగాలు తెచ్చుకుంటున్నారు. కానీ కరోనా భయంతో పనిమనుషులను పనుల్లో రానివ్వకుండా స్వయంగా పనులు చేసుకుంటున్నారు. రోజంతా ఉల్లాసంగా ఉంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

కాలుష్య రహిత వాతావరణం

పట్టణాలు, ఫ్యాక్టరీలు పెరగక మునుపు ఎక్కడ చూసినా పచ్చని పంటలు, పల్లెలు, నిర్మలమైన గాలి, కాలుష్యం లేని వాతావరణం ఉండేది. ఎప్పుడైతే పట్టణాలు, ఫ్యాక్టరీలు పెరిగాయో కాలుష్యం పెరిగిపోయింది. కొత్త కొత్త జబ్బులు రావడం మొదలయ్యాయి. లాక్ డౌన్ కారణంగా వాహనాలు, ఫ్యాక్టరీలు నడవక పోవడంతో వాతావణంలో కాలుష్యం తగ్గిపోయింది. ప్రజలకు స్వచ్చమైన గాలి అందుబాటులోకి వచ్చింది.

ఇంటి యజమాని పిల్లలతో సంతోషంగా గడపడం

ఎప్పుడూ బిజీబిజీ ఉండే ఇంటి యజమానులు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ పిల్లలకు మంచి చెడులు నేర్పుతున్నారు. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. అయితే, ఇంటి పెద్ద ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే ఉంటె సంపాదించేది ఎవరు? అందుకే ఈ సమయంలో తిరిగి పొందుతున్న అనుభూతుల్ని పదికాలాలపాటు నిలుపుకోవడానికి ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటూనే కొంత సమయం ఇంటికి.. ఇంట్లో ఉండే వారికీ కేటాయించాలనే భావన నెలకొంటోంది.

ట్రాఫిక్ జామ్లు లేని నగరాలు, కూడళ్ళు

ఎప్పుడూ రణగొణ ధ్వనులతో వాహనాలతో కిక్కిరిపోయే నగర రోడ్లు, కూడళ్లు గజిబిజి వాతావరణం లేకుండా కనిపిస్తున్నాయి. అలా అని కరోనా వెళ్ళిపోయిన తరువాత పరిస్థితి ఇలా ఉంటుంది అనుకునే అవకాశం లేదు. కాకపొతే, అవసరం అయితేనే బయటకు కదలడం.. ప్రతి చిన్న పనికీ కార్లూ, బైక్ లు తీసి పరుగులు తీసే విధానం నుంచి బయటపడటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భర్తలు, భార్యలకి ఇంటి పనుల్లో సాయం చేయడం

ఎప్పుడూ భార్యలను పట్టించుకోకుండా ఆఫీస్ పనుల్లో నిమగ్నమయ్యే భర్తలు తమ సహధర్మచారిణికి పనుల్లో సాయం చేస్తున్నారు. ఇద్దరూ సమానం అనే మాటకు అర్ధం చెపుతూ ఇంటి పనులను సమంగా చేస్తున్నారు. ఇది ఒక సామాజిక మార్పుగా చెప్పుకోవాలి, ఇంటిపట్టునే ఉండడంతో భార్య పడే ఇబ్బందులు పూర్తీ స్థాయిలో మగవాళ్ళకు అర్ధం అవుతున్నయన్డంలో సందేశం లేదు. కరోనా తగ్గిన తరువాత కూడా చాలా మంది భార్యలకు సహాయం చేస్తారని భావించవచ్చు.

పిండి వంటలకు ప్రాధాన్యత

కల్చర్ మారిన తరువాత ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. ఇంట్లో చేసిన పిండి వంటలను పట్టించుకోకుండా బయటి రుచులకు మరిగారు. కానీ ఇప్పుడు బయటి తిండిని మానేసి సాంప్రదాయ పిండివంటను చేసుకుంటున్నారు. అప్పటి వంటకాలను మళ్లీ ఒక్క సారి గుర్తు చేసుకుంటున్నారు.

దుబారా ఖర్చులు అదుపులో..

చాలా మంది యువత చేతిలో బండి ఉంటే చాలు ఇష్టం వచ్చినట్టలు వీధుల్లో చక్కర్లు కొట్టేవారు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకుని దుబారా ఖర్చులు చేసేవారు. షాపింగ్లని, సినిమాలని, షికార్లని విచ్చలవిడి ఖర్చులు చేసేవారు. ప్రస్తుతం ఆ ఖర్చులన్నీ వెనకపడ్డాయి. బయటికి వెల్లాలంటేనే పది సార్లు ఆలోచిస్తున్నారు. ఏది అవసరమో ఆ వస్తువులను మాత్రమే కోనుగోలు చేస్తున్నారు. దీంతో దోబారా ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయని అనుకోవచ్చు.

భారతీయ సాంప్రదాయ పద్ధతులు పాటించడం

గతంలో ఎవరైనా ఇంటికి వచ్చినా, ఎక్కడైనా కనిపించిన రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నోటి నిండా పలరించే వారు. కానీ సమాజంలో కల్చర్ మారిన తరువాత కౌగిలించుకోవడం, కరచాలనం చేసుకోవడం లాంటి పద్దతులు అమలులోకి వచ్చాయి. కానీ కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరు పాశ్చాత్య సంస్కృతిని మరచి భారతీయ సంస్కృతిని పాటిస్తున్నారు. రెండు చేతులతో నమస్కారం చేస్తున్నారు.

శాఖా హారులుగా మారడం..

చాలా మందికి చుక్క, ముక్క ఉంటేనే గాని ముద్ద దిగదు. కానీ ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులని బట్టి మద్యం, మాంసం అన్నీ మానేస్తున్నారు. పూర్తి శాఖాహారులుగా మారి ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా ఈ పద్దతులనే పాటిస్తూ పోతే ప్రజలకు ఆయురారోగ్యాలు, మనశ్శాంతి, స్వచ్చమైన వాతావరనం, ఐశ్వర్యం, క్రమశిక్షణ, ఒళ్ళు వంచి పని చేయడం ,అన్నీ ప్రతి ఒక్కరి సొంతం అవుతాయి.


Web TitleIs this lockdown brings back our golden old cultures in our society
Next Story